Devji: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్.. దేవ్‌జీపై వీడని సస్పెన్స్..!

Unrelenting suspense over Devji in Maredumilli encounter
  • ఏడుగురు మావోయిస్టులు మృతి.. అగ్రనేత హిడ్మా హతం
  • మరో కీలక నేత దేవ్‌జీ ఆచూకీపై వీడని మిస్టరీ
  • దేవ్‌జీని కోర్టులో ప్రవేశపెట్టాలని వామపక్ష నేతల డిమాండ్
  • ఇటీవల 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామన్న పోలీసులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించడం ఉద్యమానికి కోలుకోలేని దెబ్బగా భావిస్తుండగా, మరో కీలక నేత దేవ్‌జీ ఆచూకీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

గత మూడు రోజులుగా పోలీసులు ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య హేమ అలియాస్ రాజేతో పాటు మరో ఐదుగురు కీలక సభ్యులు హతమైనట్టు తెలుస్తోంది. దశాబ్దాలుగా భద్రతా బలగాలకు సవాలుగా మారిన హిడ్మా మరణం, మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని అధికారులు భావిస్తున్నారు.

అయితే, ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ముఖ్య నేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మరణించాడా? లేక పోలీసుల అదుపులో ఉన్నాడా? అనే దానిపై గందరగోళం నెలకొంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన దేవ్‌జీ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడంటూ గతంలో ప్రచారం జరగడంతో తాజా అనుమానాలకు మరింత బలం చేకూరింది.

ఇదిలా ఉండగా, ఇటీవలి ఆపరేషన్లలో సుమారు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల నుంచి మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఈ పరిణామాలపై సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నేతలు స్పందించారు. దేవ్‌జీ పోలీసుల అదుపులోనే ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. సూర్యం డిమాండ్ చేశారు. ఆయన స్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
Devji
Maredumilli
Andhra Pradesh
encounter
Maoists
police
Chhattisgarh
Alluri Sitarama Raju district
AP intelligence
anti naxal operations

More Telugu News