ఈ సినిమా షూటింగ్ లో కూడా నాకు గాయమైంది... సూపర్ హిట్ గ్యారెంటీ: అల్లరి నరేశ్

  • 12ఏ రైల్వే కాలనీ' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • గాయం సెంటిమెంట్‌ను గుర్తుచేసిన నరేశ్
  • 'నా సామి రంగ' సెంటిమెంట్ రిపీట్ అవుతుందని వ్యాఖ్యలు
  • 12ఏ రైల్వే కాలనీ' షూటింగ్‌లో భుజానికి గాయమైందని వెల్లడి
  • ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసిన నరేశ్
  • నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్న '12ఏ రైల్వే కాలనీ'
విలక్షణ నటుడు అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం '12ఏ రైల్వే కాలనీ'. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నరేష్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్‌ను పంచుకున్నారు. 'నా సామి రంగ' సినిమా షూటింగ్‌లో తన కాలుకు గాయమైందని, అప్పుడు నిర్మాత శ్రీనివాస చిట్టూరి అది మంచి సెంటిమెంట్ అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆయన చెప్పినట్లే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని తెలిపారు.

ఇదే సెంటిమెంట్‌ను ప్రస్తావిస్తూ, "'12ఏ రైల్వే కాలనీ' సినిమా చిత్రీకరణ సమయంలో నా భుజానికి గాయమైంది. కాబట్టి ఈ సినిమా కూడా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నాను" అని నవ్వుతూ అన్నారు. తాను 64 చిత్రాల్లో నటించినప్పటికీ, సినిమా విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఇప్పటికీ ఉంటుందని నరేశ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు నాని కాసరగడ్డపై ప్రశంసలు కురిపించారు. "నాని తన మొదటి సినిమా చేస్తున్నా ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా నమ్మకంగా ఉన్నాడు. మనం చేసిన ప్రాడక్ట్ బాగుందని నమ్మినప్పుడే ఆ ధీమా వస్తుంది" అని అన్నారు. తాను తన కెరీర్‌లో ఇప్పటివరకు 35 మంది కొత్త దర్శకులతో పనిచేశానని, ఓ దర్శకుడి కొడుకుగా వారికి ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు.

తాను హారర్ థ్రిల్లర్ జోనర్‌లో నటించడం ఇదే మొదటిసారని, చిత్ర బృందం మొత్తం ఎంతో కష్టపడి పనిచేసిందని నరేశ్ తెలిపారు. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారని, ఇది నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు.


More Telugu News