Tejashwi Yadav: ప్రతిపక్ష నేతగా ఉండేందుకు నిరాకరించిన తేజస్వి యాదవ్.. ఒప్పించిన లాలు ప్రసాద్

Tejashwi Yadav Initially Refused Opposition Leader Role
  • తాను ఎమ్మెల్యేగా పని చేయాలనుకుంటున్నట్లు తెలిపిన తేజస్వి యాదవ్
  • ఓటమికి బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను వద్దన్న తేజస్వి
  • పార్టీని ముందుండి నడిపించేందుకు నాయకుడు అవసరమని ఒప్పించిన లాలు
బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తొలుత విముఖత చూపారు. ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఆర్జేడీ మాత్రం 25 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి ఆయన నిరాకరించినట్లు సమాచారం. అయితే, తండ్రి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ నచ్చజెప్పడంతో ఆయన ఆ పదవిలో కొనసాగేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

తాను ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా పనిచేయాలనుకుంటున్నానని, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టడం ఇష్టం లేదని సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో తేజస్వి అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన పేర్కొన్నారు.

అయితే, పార్టీని ముందుండి నడిపించడానికి ప్రతిపక్ష నేత చాలా అవసరమని లాలు ప్రసాద్ యాదవ్ చెప్పడంతో తేజస్వి యాదవ్ అందుకు అంగీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, కొత్తగా ఎన్నికైన 25 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా తేజస్వి యాదవ్‌ను ఎన్నుకున్నారని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ తెలిపారు.
Tejashwi Yadav
Bihar Assembly Elections
RJD
Lalu Prasad Yadav
Bihar Politics

More Telugu News