Delhi Blast Case: ఢిల్లీ పేలుళ్ల కేసు.. హమాస్ తరహాలో డ్రోన్లతో రాకెట్ దాడులకు భారీ ప్లాన్!

Delhi Blast Case Hamas Style Drone Rocket Attack Plan Uncovered
  • ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో కీలక పురోగతి
  • కారు బాంబుకు ముందే డ్రోన్లతో రాకెట్ దాడులకు ఉగ్రవాదుల ప్లాన్
  • ప్రధాన నిందితుడి ఇద్దరు సహచరులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
  • విఫలమవ్వడంతోనే కారు బాంబు దాడికి పాల్పడినట్లు నిర్ధారణ
  • డాక్టర్లతో నడుస్తున్న ‘వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌’పై దర్యాప్తు ముమ్మరం
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. గత 48 గంటల్లో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేయడంతో ఈ కేసుకు సంబంధించి ఓ భారీ ఉగ్ర కుట్ర బట్టబయలైంది. ఉగ్రవాదులు తొలుత కారు బాంబుతో కాకుండా, డ్రోన్ల సాయంతో రాకెట్ బాంబు దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.

హమాస్, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల తరహాలో డ్రోన్ టెక్నాలజీని మార్పులు చేసి, వాటి ద్వారా రాకెట్ బాంబులను ప్రయోగించి భారీ విధ్వంసం సృష్టించాలని నిందితులు ప్లాన్ చేశారు. ఈ కుట్ర అమలు కోసం పలువురు టెక్నికల్ నిపుణులను కూడా సంప్రదించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఈ రాకెట్, డ్రోన్ దాడుల ప్రణాళిక విఫలమవడంతో, వారు కారు బాంబు దాడికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరిలో ఒకడైన జమ్మూకశ్మీర్‌కు చెందిన జసీర్ బిలాల్ వనీ అలియాస్ డానిస్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇతడు డ్రోన్ల మార్పు, రాకెట్ బాంబుల తయారీకి టెక్నికల్ సపోర్ట్ అందించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన వనీని.. ఉమర్ తీవ్రంగా ప్రభావితం చేసి ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసినట్లు తెలిసింది. కారు బాంబు కోసం వాహనాన్ని సమకూర్చిన అమీర్ అనే మరో వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు.

ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ కారు బాంబు పేలుడులో 14 మంది మరణించగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఆత్మాహుతి దాడికి పాల్పడింది అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీగా గుర్తించారు. ఈ ‘వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌’లో భాగమైన మరికొందరు డాక్టర్లను, నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేయగా.. కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సోదాలు కొనసాగుతున్నాయి.
Delhi Blast Case
Umar Un Nabi
NIA investigation
drone attack
rocket attack
car bomb
Jasir Bilal Wani
Hamas style attack
ISIS
terrorist plot

More Telugu News