టెస్ట్ క్రికెట్‌ను ఖూనీ చేస్తున్నారు.. టీమిండియాపై హర్భజన్ ఫైర్!

  • కోల్‌కతా టెస్టులో ఓటమిపై స్పందించిన హర్భజన్ సింగ్
  • ర్యాంక్ టర్నర్లతో టెస్ట్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారంటూ విమర్శ
  • ఇలాంటి పిచ్‌లపై ఆటగాళ్ల నైపుణ్యం పెరగదని ఆవేదన
  • తమకు ఇలాంటి పిచ్ కావాలని గంభీర్ చెప్పడంపై దుమారం
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలవడంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగులకే కుప్పకూలడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇలాంటి ర్యాంక్ టర్నర్లను తయారు చేస్తూ టెస్ట్ క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేస్తున్నారని టీమ్ మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు.

ఈ ఓటమి అనంతరం తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన హర్భజన్.. "టెస్ట్ క్రికెట్‌కు రిప్ (రెస్ట్ ఇన్ పీస్). వారు ఈ ఫార్మాట్‌ను పూర్తిగా నాశనం చేశారు. కొన్నేళ్లుగా ఇలాంటి పిచ్‌లు తయారు చేస్తున్నారు. జట్టు గెలుస్తోంది కాబట్టి ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు" అని ఆరోపించారు.

ఇలాంటి పిచ్‌లపై ఆడటం వల్ల ఆటగాళ్లు ఏమాత్రం ఎదగరని భజ్జీ అభిప్రాయపడ్డాడు. "మీరు గానుగెద్దులా ఒకేచోట తిరుగుతున్నారే తప్ప ముందుకు వెళ్లడం లేదు. బ్యాటర్లకు పరుగులు ఎలా చేయాలో కూడా తెలియని విధంగా పిచ్‌లను తయారు చేస్తున్నారు. నైపుణ్యంతో కాకుండా పిచ్ వల్లే వికెట్లు పడుతుంటే, సమర్థుడైన బౌలర్‌కు, బ్యాటర్‌కు తేడా ఏముంటుంది?" అని ఆయన ప్రశ్నించారు.

ఈ టెస్టులో రెండో రోజే 15 వికెట్లు పడటం, మూడో రోజు రెండు సెషన్లలోపే మ్యాచ్ ముగియడంతో పిచ్‌పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. తమకు కావాలనే ఇలాంటి పిచ్‌ను సిద్ధం చేసుకున్నామని అంగీకరించడం గమనార్హం.


More Telugu News