9 ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లికి నో.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

  • వివాహానికి ముందు శారీరక సంబంధం సర్వసాధారణమైందన్న న్యాయస్థానం
  • ఇది ప్రేమ బంధమో, ఆనందమో వారికే తెలుసన్న న్యాయస్థానం
  • యువకుడిపై నమోదైన కేసును కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు
వివాహానికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయిందని మద్రాస్‌ హైకోర్టు మధురై ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కోర్టులు విస్మరించలేవని పేర్కొంది. తొమ్మిదేళ్లుగా లైంగిక సంబంధంలో ఉండి, పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువకుడిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్‌పై ఓ యువతి వళ్లియూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కళాశాలలో తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి విజయ్‌ తనతో తొమ్మిదేళ్లు శారీరక సంబంధం కొనసాగించాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. పోలీసులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ విజయ్‌ మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించాడు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ పుగళేంది సోమవారం తీర్పు వెలువరించారు. "పిటిషనర్‌తో సుదీర్ఘ కాలం లైంగిక సంబంధం కొనసాగినప్పటికీ, ఫిర్యాదుదారు వ్యతిరేకించకపోవడం అది వారిద్దరి సమ్మతితోనే జరిగిందని సూచిస్తోంది. పెళ్లి పేరుతో విజయ్‌ మోసం చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు" అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

"ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమా? లేక కేవలం పరస్పర ఆనందమా? అనేది వారికి మాత్రమే తెలుసు. సుదీర్ఘకాలం సన్నిహితంగా ఉన్న తర్వాత సమస్యలు వస్తే, దానికోసం క్రిమినల్‌ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు. ఇలాంటి కేసు దాఖలు చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే" అని పేర్కొంటూ, యువకుడిపై నమోదైన కేసును న్యాయస్థానం రద్దు చేసింది.


More Telugu News