సన్‌రైజర్స్ కు ఈసారి కూడా అతడే కెప్టెన్!

  • ఐపీఎల్ 2026 సీజన్‌కు సన్‌రైజర్స్ కెప్టెన్‌గా పాట్ కమిన్స్
  • మూడో ఏడాది కూడా ఆస్ట్రేలియా స్టార్‌కే నాయకత్వ బాధ్యతలు
  • గత సీజన్‌లో విఫలమైనా కమిన్స్‌పై ఫ్రాంచైజీ పూర్తి విశ్వాసం
  • అభిషేక్, హెడ్‌లను అట్టిపెట్టుకుని.. షమీ, జంపా, చాహర్‌లకు ఉద్వాసన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తమ కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌నే కొనసాగించనుంది. వరుసగా మూడో ఏడాది కూడా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాయకత్వంలోనే బరిలోకి దిగనున్నట్లు ఫ్రాంచైజీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ 'ఎక్స్' ఖాతాలో కమిన్స్ ఫోటోలను పోస్ట్ చేసి స్పష్టతనిచ్చింది.

2024 ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయిలో రూ. 20.50 కోట్లకు కమిన్స్‌ను కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్, వెంటనే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అతని నాయకత్వంలో ఆ సీజన్‌లో సన్‌రైజర్స్ అద్భుతంగా రాణించి రన్నరప్‌గా నిలిచింది. అయితే, 2025 సీజన్‌లో మాత్రం జట్టు ప్రదర్శన నిరాశపరిచింది. 14 మ్యాచ్‌లలో ఆరు విజయాలు, ఏడు ఓటములతో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. అయినప్పటికీ, కమిన్స్ నాయకత్వంపై యాజమాన్యం పూర్తి విశ్వాసం ఉంచింది.

ప్రస్తుతం వెన్నుగాయంతో బాధపడుతున్న కమిన్స్, ఇంగ్లండ్‌తో పెర్త్‌లో జరగనున్న తొలి యాషెస్ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించనున్నాడు.

ఐపీఎల్ 2026 కోసం జట్టులో కొన్ని కీలక మార్పులు కూడా జరిగాయి. విధ్వంసకర ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లను అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది. అదే సమయంలో స్టార్ స్పిన్నర్లు ఆడమ్ జంపా, రాహుల్ చాహర్‌లను విడుదల చేసింది. కమిన్స్ సారథ్యంలో బౌలింగ్ విభాగాన్ని పునర్‌వ్యవస్థీకరించే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.


More Telugu News