ఆ విమానంలో రహానే ప్రశాంతంగానే ఉన్నాడు.. కానీ నేనే...!: అనుపమ్ ఖేర్

  • క్రికెటర్ రహానేతో కలిసి ఢిల్లీ-ముంబై విమానంలో ప్రయాణించిన నటుడు అనుపమ్ ఖేర్ 
  • విమానం ల్యాండ్ అయ్యి వెంటనే గాల్లోకి లేచిన వైనం
  • ఈ పరిణామంతో తన నోటి వెంట కొన్ని తిట్లు వచ్చాయన్న నటుడు
  • రహానేపై ప్రశంసల జల్లు
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనుపమ్ ఖేర్, టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే ఇటీవల ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లే విమానంలో కలిసి ప్రయాణించారు. ఈ ప్రయాణంలో జరిగిన ఓ ఆసక్తికర, భయానక సంఘటనను వివరిస్తూ అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో ఓ వీడియో, సుదీర్ఘ పోస్ట్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అనుపమ్ ఖేర్ ఒక వీడియో షేర్ చేశారు. అందులో ఆయన, రహానే పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. ఈ సందర్భంగా రహానేపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ఒక సుదీర్ఘమైన నోట్ కూడా రాశారు. "ప్రియమైన అజింక్యా రహానే! ఢిల్లీ నుంచి ముంబైకి నీతో కలిసి ప్రయాణించడం ఎంతో ఆనందంగా ఉంది. ఒక గొప్ప ఆటగాడిగా నేను నిన్ను ఎప్పుడూ ఆరాధిస్తాను. ఒక వ్యక్తిగా నీ వినయం, హుందాతనం నన్ను మరింత ఆకట్టుకున్నాయి. మన విమానం ల్యాండ్ అయి, ఆకస్మికంగా మళ్లీ టేకాఫ్ అయ్యేవరకు నా భాష, ప్రవర్తన బాగానే ఉన్నాయి. కానీ ఆ భయానక క్షణంలో నేను పెద్దమనిషిలా ప్రవర్తించలేకపోయాను. నా నోటి నుంచి కొన్ని స్వచ్ఛమైన హిందీ పదాలు (తిట్లు) వచ్చేశాయి. నువ్వు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నావు. కానీ మంచి విషయం ఏమిటంటే, ఈ ఘటన వల్ల మనం ఇప్పుడు ఒకరికొకరం గుర్తుండిపోతాం. నీకు ఎల్లప్పుడూ నా ప్రేమ, ప్రార్థనలు ఉంటాయి. జై హింద్!" అని సరదాగా రాసుకొచ్చారు.

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అజింక్య రహానేకు ప్రత్యేక స్థానం ఉంది. అతను తన కెరీర్‌లో 85 టెస్టులు ఆడి 38.46 సగటుతో 5,077 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 188. ముఖ్యంగా విదేశీ గడ్డపై, సవాలు విసిరే పిచ్‌లపై తన ప్రశాంతమైన, సాంకేతికంగా బలమైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కెప్టెన్‌గా కూడా రహానే తన ముద్ర వేశాడు. 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా జట్టును నడిపించి చారిత్రక విజయాన్ని అందించాడు. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అజేయ రికార్డును బద్దలు కొట్టి, భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో రహానే కెప్టెన్సీ కీలక పాత్ర పోషించింది. ఇక అనుపమ్ ఖేర్ చివరిగా 'మెట్రో... ఇన్ డినో' చిత్రంలో కనిపించారు.


More Telugu News