Kolusu Parthasarathy: దొంగలు దొరికిపోతారనే భయంతోనే సతీష్ కుమార్‌ను అంతమొందించారు: మంత్రి పార్థసారథి

Kolusu Parthasarathy Alleges Satish Kumar Murdered Due to TTD Theft Fear
  • టీటీడీ పరకామణిలో రూ.100 కోట్ల చోరీ జరిగిందన్న మంత్రి పార్థసారథి
  • ఫిర్యాది సతీష్ కుమార్‌ను హత్య చేశారని ఆరోపణ
  • వివేకా హత్య తరహాలోనే దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నమని వ్యాఖ్యలు
  • నెల రోజుల్లోనే ఛార్జ్‌షీట్, రాజీ కుదర్చడంపై తీవ్ర అనుమానాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణిలో జరిగిన రూ.100 కోట్ల విదేశీ కరెన్సీ చోరీ కేసులో దొంగలు దొరికిపోతారనే భయంతోనే నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్‌ను అంతమొందించారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను మంటగలిపి, దోపిడీకి పాల్పడ్డారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రంలో గత పాలకులు రాజకీయ కుట్రలకు, దోపిడీకి పాల్పడటం భక్తులను తీవ్రంగా కలిచివేసిందన్నారు. టీటీడీ పరకామణిలో ఏకంగా వంద కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ చోరీ జరిగిందన్న వార్త ఆవేదనకు గురిచేసిందన్నారు. 2023 ఏప్రిల్ 29న నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశారని, అయితే ఇంత భారీ దోపిడీకి సాధారణ సెక్షన్లు నమోదు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దోపిడీ ముఠా పనిలా ఈ వ్యవహారం నడిచిందన్నారు.

ఈ కేసు దర్యాప్తు తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని పార్థసారథి అన్నారు. కేసు పెట్టిన నెల రోజుల్లోపే, అంటే మే 31న ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం, ఆ మరుసటి రోజే (జూన్ 1న) ఫిర్యాది సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్ కలిసి కోర్టులో రాజీ మెమో దాఖలు చేయడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో తేలాలన్నారు. రూ.100 కోట్ల దోపిడీకి బదులుగా నిందితుడు రూ.14.5 కోట్ల ఆస్తులను టీటీడీకి 'దానం' చేసినట్లు చూపించి కేసును నీరుగార్చారని ఆరోపించారు. ఉన్నతాధికారుల ఒత్తిడితోనే సతీష్ కుమార్ రాజీకి అంగీకరించినట్లు విజిలెన్స్ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి వెనుక పెద్ద కుట్ర ఉందని పార్థసారథి అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించినట్లే, సతీష్ కుమార్ మరణాన్ని కూడా ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సతీష్ సోదరుడు ఇది హత్యేనని చెబుతున్నా, పోలీసుల కంటే ముందే టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆత్మహత్యగా ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాజీ వ్యవహారం కూడా భూమన ఛైర్మన్ అయిన నెల రోజుల్లోనే జరగడంపై లోతైన దర్యాప్తు అవసరమన్నారు.

గతంలో పరిటాల రవి, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో సాక్షులు చనిపోయినట్లే, ఈ కేసులోనూ సాక్షులను లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వ్యతిరేకించిన వైసీపీ నేతలు, ఇప్పుడు ఈ కేసులో సీబీఐ విచారణ కోరడం వాస్తవాలను నీరుగార్చే ప్రయత్నమేనని విమర్శించారు. గత ప్రభుత్వానికి తిరుమల శ్రీవారిపై భక్తి, గౌరవం లేవని, పవిత్ర క్షేత్రాన్ని దోచుకోవడానికి ఒక అవకాశంగా మాత్రమే చూశారని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా సరే, వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం తరఫున ఆయన హామీ ఇచ్చారు.
Kolusu Parthasarathy
TTD
Tirumala
Satish Kumar
Foreign Currency Theft
Vigilance Officer
Bhumana Karunakar Reddy
Andhra Pradesh Politics
TDP
YSRCP

More Telugu News