'వారణాసి' వీడియోకు జీవం పోశారు: రాజమౌళి

  • 'వారణాసి' అనౌన్స్‌మెంట్ వీడియోకు అద్భుత స్పందన
  • సాంకేతిక బృందంలోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా రాజమౌళి ధన్యవాదాలు
  • సంగీత దర్శకుడు కీరవాణి నుంచి ఎడిటర్ వరకు అందరి పేర్ల ప్రస్తావన
  • వీఎఫ్ఎక్స్ అందించిన స్టూడియోలను ప్రత్యేకంగా అభినందించిన జక్కన్న
  • అభిమానుల క్రమశిక్షణను గతంలోనే మెచ్చుకున్న దర్శకధీరుడు
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన 'వారణాసి' అనౌన్స్‌మెంట్ వీడియోకు వస్తున్న అద్భుత స్పందన పట్ల మరోసారి ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, తాజాగా ఈ వీడియో రూపకల్పన వెనుక ఉన్న తన సాంకేతిక బృందంలోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసిన రాజమౌళి, "ఈ వీడియోను నా ఊహకు తగ్గట్లుగా మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడిన నా అద్భుతమైన బృందానికి ధన్యవాదాలు... వారణాసి వీడియోకు జీవం పోశారు" అని పేర్కొన్నారు. ఈ క్రమంలో వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్, డీఓపీ పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ మోహన్, సంగీత దర్శకుడు కీరవాణి, కాస్ట్యూమ్ డిజైనర్ రమ, యానిమేషన్ సూపర్‌వైజర్ దీపక్, కాన్సెప్ట్ డిజైనర్ ప్రతీక్, ఎడిటర్ తమ్మిరాజు పేర్లను ప్రస్తావించారు.

వీఎఫ్ఎక్స్ వర్క్ చేసిన సంస్థలను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. "మా అనౌన్స్‌మెంట్ వీడియోకు అద్భుతమైన వీఎఫ్ఎక్స్ అందించిన మిస్టీమ్యాన్ స్టూడియోస్‌కు, క్రియేటివ్ డైరెక్టర్ అలెక్స్ పై... అందరికీ నా థ్యాంక్స్. అలాగే చివరి నిమిషం వరకు మద్దతుగా నిలిచిన విస్కెఫీ, ఫాంటమ్ ఎఫెక్స్, గింప్‌విల్లే బృందాలకు కూడా నా కృతజ్ఞతలు" అని రాజమౌళి తన పోస్టులో వివరించారు.

కాగా, టైటిల్ టీజర్ విడుదలైన మరుసటి రోజే రాజమౌళి ప్రేక్షకులకు, ముఖ్యంగా మహేశ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. 'వారణాసి గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్ కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులను, వారి క్రమశిక్షణను ఆయన ప్రశంసించారు. 'వారణాసి' అనౌన్స్‌మెంట్ వీడియోకు వస్తున్న ప్రశంసలపై చిత్రబృందం మొత్తం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News