Sajjanar: 'ఐబొమ్మ' రవి వద్ద 50 లక్షల మంది డేటా ఉంది.. రూ. 20 కోట్లు సంపాదించాడు: సజ్జనార్

Sajjanar on iBOMMA Ravi 50 Lakhs Data and Illegal Earnings
  • ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
  • పైరసీ ద్వారా రూ.20 కోట్లు సంపాదించినట్లు వెల్లడి
  • పైరసీ ముసుగులో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు గుర్తింపు
తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగిస్తున్న ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో ఆయన విస్తుపోయే నిజాలను మీడియా ముందుంచారు. ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు తదితరులు సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకున్నందుకు సైబర్ క్రైమ్ పోలీసులను వారు అభినందించారు.

ఈ భేటీ అనంతరం సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. పైరసీ దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశాం. బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన వేలాది సినిమాలను ఇతను పైరసీ చేశాడు. పైరసీ ద్వారా సుమారు రూ.20 కోట్లు సంపాదించినట్లు ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నాం" అని తెలిపారు.

రవి వద్ద సుమారు 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా ఉందని, ఈ డేటాను దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉందని సజ్జనార్ హెచ్చరించారు. పైరసీ వెబ్‌సైట్ల ముసుగులో బెట్టింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ చేశారని, దీనివల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారని అన్నారు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మరోదాన్ని సృష్టిస్తూ.. రవి మొత్తం 65 మిర్రర్ వెబ్‌సైట్లను నడిపినట్లు గుర్తించారు.

ఇమ్మడి రవికి ముందు నుంచే నేర చరిత్ర ఉందని, మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ సృష్టించాడని సజ్జనార్ తెలిపారు. కరేబియన్ దీవుల్లో పౌరసత్వం కూడా తీసుకున్నాడని, అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లు ఏర్పాటు చేసి ఈ పైరసీ సామ్రాజ్యాన్ని నడిపాడని వివరించారు. ఈ కేసులో గతంలోనే దుద్దెల శివరాజ్, ప్రశాంత్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశామని, రవిపై ఐటీ, కాపీరైట్ చట్టాల కింద మొత్తం 5 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Sajjanar
iBOMMA
Immidi Ravi
Tollywood
Chiranjeevi
Nagarjuna
Rajamouli
Dil Raju
movie piracy
cyber crime

More Telugu News