వివాదంలో రాజమౌళి.. దేవుడిపై వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం!

  • తనకు దేవుడిపై నమ్మకం లేదంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
  • మహేశ్ బాబు సినిమా ఈవెంట్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించిన జక్కన్న
  • గతంలో రాముడిపై చేసిన ట్వీట్‌ను సైతం వైరల్ చేస్తున్న నెటిజన్లు
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. తన సినిమాలతోనే వార్తల్లో నిలిచే ఆయన, ఇప్పుడు తన వ్యక్తిగత విశ్వాసాలపై చేసిన వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేవుడిపై తనకు నమ్మకం లేదని చెప్పడం, దానికి తోడు గతంలో ఆయన చేసిన ఓ పాత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ, తన తండ్రి "సినిమాను హనుమంతుడే చూసుకుంటాడు" అన్నప్పుడు తనకు కోపం వచ్చిందని, ఎందుకంటే తనకు దేవుడిపై నమ్మకం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే ఆయనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.

ఇదే సమయంలో, 2011లో రాజమౌళి చేసిన ఓ పాత ట్వీట్‌ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పిన ఓ అభిమానికి బదులిస్తూ, "థాంక్యూ.. కానీ నాకు రాముడంటే ఎప్పుడూ ఇష్టం లేదు. అన్ని అవతారాల్లో కృష్ణుడే ఇష్టం" అని జక్కన్న రిప్లై ఇచ్చారు. ఈ రెండు సంఘటనలను కలిపి చూపిస్తూ, "రాముడి పేరుతో సినిమాలు తీస్తూ కోట్లు సంపాదిస్తున్న మీరు, ఆయనపై ఇలాంటి అభిప్రాయం కలిగి ఉండటమేంటి?" అంటూ నెటిజన్లు రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 


More Telugu News