CV Anand: బాలయ్య అభిమానులకు సీవీ ఆనంద్ క్షమాపణ.. వివాదంపై పూర్తి వివరణ

CV Anand Apologizes to Balakrishna Fans Over Social Media Post
  • ఎమోజి వివాదంపై ఎట్టకేలకు స్పందించిన సీవీ ఆనంద్
  • సోషల్ మీడియా హ్యాండ్లర్ వల్లే పొరపాటు జరిగిందని వెల్లడి
  • బాలకృష్ణకు వ్యక్తిగతంగా మెసేజ్ చేశానన్న ఆనంద్
  • వివాదాన్ని ఇంతటితో ముగించాలని అభ్యర్థన
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానుల ఆగ్రహంపై తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ ఎట్టకేలకు స్పందించారు. తన ఎక్స్ ఖాతా నుంచి వచ్చిన ఎమోజి రిప్లైతో చెలరేగిన వివాదంపై ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆ వివాదానికి కారణం తాను కాదని, తన సోషల్ మీడియా హ్యాండ్లర్ చేసిన పొరపాటు అని స్పష్టం చేశారు. ఈ ఘటన బాలకృష్ణను బాధించి ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు.

అసలేం జరిగిందంటే..
గత నెలలో టాలీవుడ్ ప్రముఖులతో పైరసీ నివారణపై సీవీ ఆనంద్ ఓ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర నటులు హాజరయ్యారు. ఈ విషయంపై ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా, 'ఈ మీటింగ్‌కు బాలకృష్ణను కూడా పిలవాలి. లేదంటే ఆయన ఏపీ అసెంబ్లీలో అడుగుతారు' అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. దీనికి సీవీ ఆనంద్ ఖాతా నుంచి నవ్వుతున్న ఎమోజితో రిప్లై వచ్చింది. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు, ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను అవమానించారంటూ, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీవీ ఆనంద్ వివరణ:
ఈ వివాదంపై సీవీ ఆనంద్ తాజాగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "దాదాపు రెండు నెలల క్రితం పెట్టిన ఒక ఎమోజి కోసం బాలయ్య అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేయడం గమనించాను. నాకు సమయం లేకపోవడంతో నా సోషల్ మీడియా ఖాతాలను ఓ హ్యాండ్లర్ చూసుకునేవాడు. సెప్టెంబర్ 29న బాలయ్య గారిపై వచ్చిన కామెంట్‌కు అతను నవ్వుతున్న ఎమోజితో స్పందించాడు. అది పూర్తిగా తప్పు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి, బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా మెసేజ్ చేసి క్షమాపణ కోరాను. బాలయ్య, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జునల సినిమాలు చూస్తూ పెరిగాను, వారందరిపై నాకు గౌరవం ఉంది. ఇప్పటికే ఆ సోషల్ మీడియా హ్యాండ్లర్‌ను తొలగించాను. దయచేసి అందరూ ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి" అని అభ్యర్థించారు.
CV Anand
Balakrishna
Nandamuri Balakrishna
Telangana
Tollywood
Chiranjeevi
Nagarjuna
Venkatesh
Social Media
Apology

More Telugu News