పవన్ పేషీలో సురేష్ అనే వ్యక్తి ఎవరూ లేరు... వైసీపీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: జనసేన

  • పవన్ పేషీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని జనసేన ఆగ్రహం
  • వైసీపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం
  • పేషీలో సురేష్ అనే వ్యక్తి లేరని స్పష్టం చేసిన పార్టీ
  • ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ దుష్ప్రచారం అని ఆరోపణ
  • ఆరోపణలు చేసిన, ప్రచురించిన వారిపై కేసులు పెడతామని హెచ్చరిక
  • రంగంలోకి దిగిన జనసేన పార్టీ న్యాయ విభాగం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయంపై వైసీపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని జనసేన పార్టీ తీవ్రంగా ఆరోపించింది. పేషీలో సురేష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడని, అతడు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వైసీపీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ నిరాధార ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు జనసేన ఒక ప్రకటనలో వెల్లడించింది.

అసలు ఉప ముఖ్యమంత్రి పేషీలో సురేష్ అనే వ్యక్తి పనిచేయడం లేదని జనసేన స్పష్టం చేసింది. గతంలోనూ అనేక నిరాధార ఆరోపణలు చేసిన వైసీపీ, ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. పవన్ కల్యాణ్ నిబద్ధత, పారదర్శకతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేందుకే ఈ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించింది.

ఈ తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ పేర్కొంది. నిరాధార ఆరోపణలు చేసిన వారిపై, అలాగే నిజానిజాలు నిర్ధారించుకోకుండా వార్తలను ప్రచురించిన వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు తమ పార్టీ న్యాయ విభాగం సిద్ధంగా ఉందని ఆ ప్రకటనలో హెచ్చరించింది.


More Telugu News