కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం.. కొత్తవలసలో థీమ్ సిటీ: మంత్రి నారాయణ

  • విశాఖ అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష
  • వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సూచన
  • జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న మాస్టర్‌ప్లాన్ రోడ్ల పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

విశాఖ నగరాభివృద్ధిలో భాగంగా వీఎంఆర్‌డీఏ చేపట్టిన 8 ఎంఐజీ ప్రాజెక్టులతో పాటు రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నగరానికి ఐకాన్‌గా నిలిచేలా కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా, కొత్తవలస వద్ద 120 ఎకరాల విస్తీర్ణంలో ఒక థీమ్ బేస్డ్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, జూన్ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. విశాఖ మాస్టర్‌ప్లాన్ డిజైన్‌ను కూడా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తామని ఆయన వివరించారు. నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 


More Telugu News