పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. 17 నుంచి ఉత్సవాలు

  • రేపు ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభం
  • 22న గరుడ వాహనసేవ, 24న రథోత్సవం
  • 25న పంచమీ తీర్థంతో ఉత్సవాల ముగింపు
  • ప్రతిరోజూ ఉదయం, రాత్రి అమ్మవారి వాహన సేవలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు నేడు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. అంకురార్పణ సందర్భంగా నేటి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.

నవంబర్ 17వ తేదీ ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయి. ఉత్సవాలు జరగనున్న తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అమ్మవారు వివిధ వాహనాలపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22న స్వర్ణరథం, గరుడ వాహన సేవ, 24న రథోత్సవం కన్నులపండువగా జరగనున్నాయి. చివరి రోజైన నవంబర్ 25న ఉదయం పంచమీ తీర్థం (చక్రస్నానం), రాత్రి ధ్వజావరోహణంతో ఈ వార్షిక ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. 


More Telugu News