Rana Daggubati: సీఐడీ విచారణకు హాజరైన రానా, యాంకర్ విష్ణుప్రియ

Rana Daggubati Anchor Vishnu Priya Attend CID Inquiry
  • ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వేగవంతమైన విచారణ
  • రానా, విష్ణుప్రియ స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసిన అధికారులు
  • ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్‌ను విచారించిన సీఐడీ
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, యాంకర్ విష్ణుప్రియ ఈరోజు సీఐడీ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో అధికారులు వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు.

యాంకర్ విష్ణుప్రియ మూడు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. విచారణలో భాగంగా ఆమె తన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను కూడా సిట్ అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. ఈ ప్రమోషన్ల కోసం చేసుకున్న ఒప్పందాలు, వాటి ద్వారా పొందిన ఆదాయంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ కేసులో మొత్తం 29 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి వంటి వారు ఉన్నారు. రెండు రోజుల క్రితమే నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సిట్ ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.

హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా సీఐడీ సిట్ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. రాబోయే రోజుల్లో మరికొంతమంది సెలబ్రిటీలను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Rana Daggubati
Vishnu Priya
CID Investigation
Online Betting Apps
Gaming Apps Promotion
Tollywood Celebrities
Hyderabad CID
Vijay Deverakonda
Prakash Raj
Manchu Lakshmi

More Telugu News