కేసీఆర్ మాట్లాడితే ప్రవచనాలు, రేవంత్ మాట్లాడితే బూతులా?: కేటీఆర్‌పై అద్దంకి దయాకర్ ఫైర్

  • జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత కూడా కేటీఆర్ అహంకారం తగ్గలేదన్న దయాకర్
  • ఆయన వల్ల బీఆర్ఎస్ పతనం కావడం ఖాయమని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి ముందుండి కాంగ్రెస్‌ను గెలిపించారని కితాబు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటర్లు చావుదెబ్బ కొట్టినా కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయంగా పతనావస్థలో ఉన్నప్పటికీ ఆయన తీరు మారకపోవడం విచారకరమని అన్నారు. కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ పతనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ తానై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించారని కొనియాడారు. రాజకీయ విమర్శలపై కేటీఆర్ తీరును దయాకర్ తప్పుబట్టారు. కేసీఆర్ మాట్లాడితే ప్రవచనాల్లా, అదే రేవంత్ రెడ్డి బదులిస్తే బూతుల్లా వినిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ మైత్రి ఉందని ఆయన ఆరోపించారు. "దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి" అని కేటీఆర్ విసురుతున్న సవాళ్లపై స్పందిస్తూ.. "అరెస్ట్ చేయడానికి దమ్ము ఉండాల్సిన అవసరం లేదు, పోలీసులకు చెబితే ఆ పని వాళ్లే చేస్తారు" అని అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.


More Telugu News