త్వరలో పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధాన?.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!

  • త్వరలో పెళ్లి చేసుకోనున్న స్మృతి మంధాన, పలాశ్‌ ముచ్చల్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వెడ్డింగ్ ఇన్విటేషన్
  • ఈ నెల‌ 20న వీరి వివాహం జరగనుందంటూ ప్రచారం
  • స్నేహితుల పోస్టులతో పెళ్లి వార్తలకు మరింత బలం
  • ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించని స్మృతి, పలాశ్‌ జంట
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్‌ ముచ్చల్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. ఈ నెల‌ 20న వీరి వివాహం జరగనుందంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పలాశ్ దర్శకత్వం వహించిన 'అర్ధ్' సినిమా క్యాస్టింగ్ డైరెక్టర్ బర్షా గొగోయ్ శుక్రవారం స్మృతి, పలాశ్‌తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంటూ, "హలో భాయ్‌సాబ్, నీకు పెళ్లి చేసేద్దాం" అని క్యాప్షన్ పెట్టారు. దీనికి పలాశ్‌ హార్ట్ ఎమోజీతో స్పందించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ ప్రచారంపై ఇప్పటివరకు స్మృతి గానీ, పలాశ్‌ గానీ అధికారికంగా స్పందించలేదు.

గతంలో ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పలాశ్‌ మాట్లాడుతూ.. "ఆమె త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను" అని వ్యాఖ్యానించడం వీరి బంధంపై అప్పట్లో చర్చకు దారితీసింది. ఇటీవలే భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించారు. ఈ విజయాన్ని పలాశ్‌ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీతో, స్మృతితో కలిసి ఫొటోలు దిగారు. అంతేకాకుండా స్మృతి జెర్సీ నంబర్‌కు గుర్తుగా తన చేతిపై వేయించుకున్న 'SM18' ట్యాటూను చూపిస్తూ దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు. క్రికెట్ సీజన్ ముగిశాక ఈ జంట తమ పెళ్లి వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.



More Telugu News