AP High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు.. ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశం

AP High Court Orders Reservations for Transgenders in Government Jobs
  • ఆరు నెలల్లోగా విధానం రూపొందించాలన్న హైకోర్టు
  • డీఎస్సీ అభ్యర్థి రేఖను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం
  • సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారన్న పిటిషనర్
  • ట్రాన్స్‌జెండర్ల అభ్యున్నతి ప్రభుత్వాల బాధ్యత అని వ్యాఖ్య
  • కేంద్ర చట్టం ఉన్నా రాష్ట్రాలు అమలు చేయడం లేదన్న న్యాయస్థానం
ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల కల్పనపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా వారికి రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రస్తుత మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసిన పిటిషనర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. విజయ్ ఇటీవల తీర్పు ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ట్రాన్స్‌జెండర్ కె.రేఖ, 2025 మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 671వ ర్యాంకు సాధించినప్పటికీ, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా పోస్టులు కేటాయించలేదన్న కారణంతో అధికారులు ఆమె అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ట్రాన్స్‌జెండర్లకు పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. అయితే, ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ప్రత్యేక రిజర్వేషన్ లేనప్పుడు నియామక ప్రక్రియను తప్పుపట్టలేమని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, కీలక వ్యాఖ్యలు చేశారు. "దేశంలో అత్యంత వెనుకబడిన వర్గాల్లో ట్రాన్స్‌జెండర్లు ఒకరు. వారి హక్కుల పరిరక్షణకు కేంద్రం 2019లో చట్టం తెచ్చినా, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం లేదు. వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది" అని తీర్పులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే పిటిషనర్‌ను ఉద్యోగానికి పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఆరు నెలల్లోగా రిజర్వేషన్ల విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
AP High Court
Transgenders
Transgender Reservation
AP Government Jobs
K Rekha
Mega DSC
School Assistant Post
Eluru District
Justice N Vijay
Transgender Rights

More Telugu News