AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్.. ముంబైలో కీలక అరెస్ట్

AP Liquor Scam Anil Chokhra Arrested for Money Laundering
  • ముంబైకి చెందిన మనీలాండరింగ్ నిపుణుడు అనిల్ చోఖ్రా అరెస్ట్
  • ప్రధాన నిందితుడికి చెందిన రూ.77.55 కోట్లు మళ్లించినట్లు ఆరోపణ
  • డొల్ల కంపెనీలతో నిధులు బదిలీ చేసినట్లు గుర్తించిన సిట్
  • కేసులో 49వ నిందితుడిగా చేర్చిన అధికారులు
  • విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
జగన్‌ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన భారీ మద్యం కుంభకోణం కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన అనిల్ చోఖ్రాను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన రూ.77.55 కోట్ల నగదును డొల్ల కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై ప్రధాన అభియోగం.

సిట్ దర్యాప్తు ప్రకారం చోఖ్రా ముంబై కేంద్రంగా బినామీల పేర్లతో నాలుగు డొల్ల కంపెనీలను సృష్టించాడు. క్రిపటి ఎంటర్‌ప్రైజెస్‌, నైస్‌నా మల్టీ వెంచర్స్‌, ఓల్విక్‌ మల్టీ వెంచర్స్‌, విశాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్లతో ఉన్న ఈ కంపెనీల ఖాతాల్లోకి తొలుత లిక్కర్ సొమ్మును జమచేశారు. అనంతరం ఆ నిధులను మరో 32 వేర్వేరు ఖాతాలకు బదిలీ (లేయరింగ్) చేసి, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు.

అనిల్ చోఖ్రాకు మనీలాండరింగ్ కొత్తేమీ కాదని, గతంలో ఇదే తరహా నేరాలకు పాల్పడినందుకు 2017, 2021 సంవత్సరాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన్ను రెండుసార్లు అరెస్టు చేసిందని సిట్ తెలిపింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత, లిక్కర్ స్కామ్ సొమ్మును వైట్‌గా మార్చేందుకు మద్యం స్కామ్ నిందితులు ఆయన్ను సంప్రదించినట్లు దర్యాప్తులో తేలింది. భారీగా కమీషన్ తీసుకుని చోఖ్రా ఈ లావాదేవీలకు సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.

టెక్నాలజీ సహాయంతో నిందితుడి సంప్రదింపులపై నిఘా పెట్టిన సిట్ అధికారులు, ఈ నెల 13న అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆయన్ను 49వ నిందితుడిగా చేర్చారు. ఈరోజు చోఖ్రాను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.
AP Liquor Scam
Anil Chokhra
Andhra Pradesh liquor scam
Raj Kasireddy
Money laundering
ED
YSRCP
Vijayawada ACB Court
Fake companies

More Telugu News