బీహార్‌లో ఎన్డీయే చారిత్రాత్మక విజయం... 202 స్థానాలతో సునామీ

  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం
  • 243 స్థానాలకు గాను 202 సీట్లను కైవసం చేసుకున్న కూటమి
  • గతంలో కంటే రెట్టింపు సీట్లు సాధించిన జేడీయూ
  • 35 స్థానాలకే పరిమితమై కుదేలైన ప్రతిపక్ష మహాగఠబంధన్
  • ఘోరంగా దెబ్బతిన్న ఆర్‌జేడీ, కాంగ్రెస్ పార్టీ
  • మరోసారి బీహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు 
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తి కాగా... మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 202 సీట్లను కైవసం చేసుకున్న ఎన్డీయే, డబుల్ సెంచరీ మైలురాయిని దాటింది. ఈ భారీ విజయంతో బీహార్‌లో మరోసారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

ఈ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందగా, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 85 సీట్లతో అద్భుతమైన పునరాగమనం చేసింది. 2020 ఎన్నికల్లో కేవలం 43 సీట్లు మాత్రమే గెలిచిన జేడీయూ, ఈసారి రెట్టింపు స్థానాలు దక్కించుకోవడం విశేషం. కూటమిలోని ఇతర పక్షాలైన ఎల్‌జేపీ (ఆర్‌వీ) 19, హెచ్‌ఏఎం 5, ఆర్‌ఎల్‌ఎం 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌధరీ, విజయ్ కుమార్ సిన్హా సహా గాయని మైథిలీ ఠాకూర్, శ్రేయసి సింగ్ వంటి ప్రముఖులు గెలుపొందారు.

మరోవైపు, ప్రతిపక్ష మహాగఠబంధన్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2020లో 110 సీట్లు గెలుచుకున్న ఈ కూటమి, ఈసారి కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్‌జేడీ 75 సీట్ల నుంచి 25 స్థానాలకు పడిపోగా, కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 6 సీట్లకు దిగజారింది. ఇది కాంగ్రెస్ చరిత్రలోనే రెండో అత్యంత పేలవమైన ప్రదర్శన. వామపక్షాలు 3 సీట్లకే సరిపెట్టుకున్నాయి.

ఈ ఫలితాలతో బీహార్ రాజకీయాల్లో ఎన్డీఏ తన పట్టును మరింత బిగించినట్లయింది. ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్, ఎన్డీఏ కూటమి పాలన కొనసాగడం ఖాయమైంది.


More Telugu News