జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు, బీహార్‌లో మజ్లిస్ 5 స్థానాల్లో గెలవడంపై స్పందించిన అసదుద్దీన్

  • బీఆర్ఎస్ కిందిస్థాయికి పడిపోయిన పార్టీ అన్న అసదుద్దీన్
  • తనను విమర్శిస్తే బలపడతామని బీఆర్ఎస్ భావిస్తోందని వ్యాఖ్య
  • మజ్లిస్ పార్టీకి ఓటేసిన బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన అసదుద్దీన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఐదు స్థానాల్లో గెలుపొందడంపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌ను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.

ఆ పార్టీ దిగజారిపోయిన పార్టీ అని ఆయన అన్నారు. తనను విమర్శిస్తే బలపడతానని బీఆర్ఎస్ భావిస్తోందని అన్నారు. అజారుద్దీన్‌పై ఉన్న కోపాన్ని తనను విమర్శించడం ద్వారా తీర్చుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీహార్‌లో ఐదు స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించిందని అసదుద్దీన్ తెలిపారు. తమకు ఓటు వేసిన బీహార్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఐదు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని ఆయన ప్రశంసించారు. బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామని ఆయన అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అసదుద్దీన్ అభినందనలు తెలిపారు. మజ్లిస్ పార్టీ ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని ఆపే శక్తి ఆర్జేడీకి లేదని ఆయన అన్నారు.


More Telugu News