Govinda: గోవిందాకు అస్వస్థత.. ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన భార్య సునీత

Govinda Health Update from Wife Sunita Ahuja
  • కొత్త సినిమా కోసం వర్కౌట్లు చేస్తూ స్పృహ తప్పిన గోవిందా
  • ముంబైలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స
  • ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన భార్య
  • ఆందోళన పడాల్సిన అవసరం లేదన్న‌ సునీత
  • అతిగా వ్యాయామం చేయడం వల్లే ఇలా జరిగిందన్న‌ గోవిందా
  • ప్రతి ఒక్కరూ యోగా, ప్రాణాయామం చేయాలని సూచన
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా అస్వస్థతకు గురైన విష‌యం తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో స్పృహ తప్పి పడిపోవడంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అర్ధాంగి సునీత అహుజా స్పష్టం చేశారు.

సునీత తన యూట్యూబ్ వ్లాగ్‌లో గోవిందా ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. "గోవిందా ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నారు. తన కొత్త సినిమా 'దునియాదారీ' కోసం ఆయన చాలా కష్టపడి వర్కౌట్లు చేస్తున్నారు. ఆ క్రమంలోనే అలిసిపోయి స్పృహ తప్పి పడిపోయారు. కానీ ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు. ఎవరూ ఆందోళన పడొద్దు" అని ఆమె తెలిపారు. గోవిందా ఆసుపత్రిలో చేరిన విషయం ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి తనకు తెలిసిందని సునీత పేర్కొన్నారు. 

గోవిందా స్నేహితుడు, న్యాయ సలహాదారు లలిత్ బిందాల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మొదట ఫోన్‌లో వైద్యుడిని సంప్రదించి మందులు వాడారని, ఆ తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత గోవిందా స్వయంగా మీడియాతో మాట్లాడారు. బ్లేజర్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆయన, తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. శక్తికి మించి కఠినమైన వ్యాయామాలు చేయడంతోనే స్పృహ తప్పి పడిపోయానని ఆయన అంగీకరించారు. "దయచేసి అందరూ యోగా, ప్రాణాయామం చేయండి. నేను ఎదుర్కొన్న సమస్యలకు ఇవి చాలా మంచివి" అని ఆయన సూచించారు.

చాలా కాలం తర్వాత గోవిందా "దునియాదారీ" చిత్రంతో వెండితెరపైకి తిరిగి రానున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆయన చివరిసారిగా 2019లో "రంగీలా రాజా" చిత్రంలో శక్తి కపూర్, దిగంగన సూర్యవంశీ వంటి నటులతో కలిసి కనిపించారు.
Govinda
Govinda health
Sunita Ahuja
Duniyaadari movie
Bollywood actor
Rangila Raja
Health update
Lalit Bindal
Yoga pranayama

More Telugu News