Nara Lokesh: పెట్టుబడులకు ఏపీనే స్వర్గధామం.. మంత్రి లోకేశ్‌ చెప్పిన 3 కారణాలివే!

Nara Lokesh explains 3 reasons to invest in AP
  • విశాఖలో ఘనంగా ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • పెట్టుబడులకు ఏపీని ఎంచుకోవడానికి మూడు కారణాలున్నాయన్న లోకేశ్‌
  • చంద్రబాబు నాయకత్వమే మొదటి బలం అని వెల్లడి
  • మీకంటే వేగంగా పనిచేస్తామని పెట్టుబడిదారులకు హామీ
  • ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందని వ్యాఖ్య
  • రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ధీమా
పెట్టుబడులకు ఏపీ ఎందుకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వివరించారు. రాష్ట్రంలో అనుభవజ్ఞమైన నాయకత్వం, వేగవంతమైన పాలన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఉన్నాయని, పెట్టుబడిదారులు ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు రావచ్చని ఆయన భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారతదేశం ఇంజన్‌గా నిలుస్తున్న తరుణంలో సీఐఐ సదస్సుకు ఏపీ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని అన్నారు. "పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు ఎంచుకోవాలని చాలామంది నన్ను అడుగుతారు. అందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. మొదటిది.. అనుభవం, దార్శనికత కలిగిన సీఎం చంద్రబాబు నాయకత్వం. ఒక రాజకీయ నాయకుడికి వారసత్వాన్ని నిర్మించే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. కానీ, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అమరావతి, విశాఖపట్నం రూపంలో రెండో వారసత్వాన్ని నిర్మించే అవకాశం ఇచ్చారు" అని లోకేశ్‌ పేర్కొన్నారు.

మీకంటే వేగంగా మేం పనిచేస్తాం
పెట్టుబడులకు ఏపీని ఎంచుకోవడానికి రెండో కారణం 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అని లోకేశ్‌ తెలిపారు. "సాంకేతికత, మార్కెట్లు వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో వేగం చాలా ముఖ్యం. పెట్టుబడిదారులు కూడా ప్రభుత్వాలు అంతే వేగంగా స్పందించాలని కోరుకుంటున్నారు. భూ కేటాయింపుల నుంచి అనుమతులు, ప్రోత్సాహకాల వరకు అన్నింటినీ వేగంగా అందిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో మీ కంపెనీ వేగాన్ని మించి మేం పనిచేస్తామని హామీ ఇస్తున్నాను. ఒక్కసారి మాతో చేతులు కలిపితే అది మీ ప్రాజెక్ట్ కాదు, మా ప్రాజెక్ట్" అని ఆయన స్పష్టం చేశారు.

డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్
మూడో కారణంగా ఏపీలో ‘డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ ఉందని మంత్రి లోకేశ్‌ అభివర్ణించారు. "ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తాయి. మీ వ్యాపారాన్ని విజయవంతం చేయడంతో పాటు అవసరమైన సంస్కరణలు, విధానపరమైన మార్పులు తీసుకురావడానికి కేంద్రంతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని ఆయన అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని లోకేశ్‌ ధీమా వ్యక్తం చేశారు.
Nara Lokesh
AP investments
Andhra Pradesh investments
CII Partnership Summit
Visakhapatnam
Chandrababu Naidu
Ease of doing business
Double engine government
AP economy
AP IT sector

More Telugu News