జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాల సరళిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన

  • జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ
  • ప్రజల తీర్పుతో మరింత బాధ్యతగా పనిచేస్తామన్న పొన్నం ప్రభాకర్ 
  • రిగ్గింగ్ ఆరోపణలు కేవలం దుష్ప్రచారమేనని వ్యాఖ్య  
జూబ్లీ‌హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొనగా, ఫలితాల సరళిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రజలు తమ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని, ఈ తీర్పుతో మరింత బాధ్యతగా పనిచేస్తామని ఆయన అన్నారు.

మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్, జూబ్లీ‌హిల్స్ గెలుపును తాము ముందే ఊహించామని తెలిపారు. మెజారిటీ విషయంలో కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ, ప్రజలు మరోసారి తమవైపే ఉన్నారనే విషయం స్పష్టమైందని అన్నారు. "ప్రజాస్వామ్యంలో ఎంతో పకడ్బందీగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రిగ్గింగ్ అనే పరిస్థితి ఉండదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కేవలం దుష్ప్రచారం మాత్రమే" అని ఆయన కొట్టిపారేశారు. పోలింగ్ ముగిసే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు తమ పార్టీ కార్యాలయం మీదకు దాడికి వచ్చాయని కూడా ఆయన ఆరోపించారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే ఈ ఆధిక్యానికి కారణమని పొన్నం ప్రభాకర్ వివరించారు. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు వంటి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం కోసం తీసుకున్న నిర్ణయాలు కూడా సత్ఫలితాలనిస్తున్నాయని, ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 


More Telugu News