విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన భాగస్వామ్య సదస్సు.. సీఎం చంద్రబాబు నాయకత్వంపై ప్రముఖుల ప్రశంసలు

  • విశాఖలో ఘనంగా ప్రారంభమైన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • సీఎం చంద్రబాబు నాయకత్వంపై పారిశ్రామికవేత్తల ప్రశంసలు
  • రాష్ట్రంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టామన్న కరణ్ అదానీ
  • భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామన్న జీఎంఆర్
  • రాష్ట్రంలో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న బజాజ్ ఫిన్‌సర్వ్
  • రక్షణ, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు సిద్ధమన్న భారత్ ఫోర్జ్
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి వేదికగా 30వ సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూశ్‌ గోయెల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, పెట్టుబడిదారులు, కరణ్ అదానీ, యూసఫ్ అలీ, బాబా కల్యాణి వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఏపీపై పారిశ్రామికవేత్తల విశ్వాసం
సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై, సీఎం చంద్రబాబు నాయకత్వంపై బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ.. "సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌'తో ఏపీ ఆధునికంగా మారుతోంది. దేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ రంగాల్లో ఇప్పటికే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. తద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించాం. మంత్రి నారా లోకేష్ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దుతున్నారు" అని ప్రశంసించారు.

జీఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ, చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా ఏపీలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. "భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం" అని వివరించారు.

బజాజ్ ఫిన్‌సర్వ్ చైర్మన్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం కాదు, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజిన్. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతంతో వాణిజ్యం, టెక్నాలజీకి గేట్‌వేగా నిలుస్తోంది. యువతకు అండగా విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలలో రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం" అని ప్రకటించారు.

భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా మాట్లాడుతూ, ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీలోనే తమ సంస్థ కోవిడ్‌కు వ్యాక్సిన్ తయారు చేసిందని గుర్తుచేశారు. ఆవిష్కరణలు, భాగస్వామ్యంతోనే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుందని ఆమె అన్నారు.

భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ అమిత్ కల్యాణి మాట్లాడుతూ, ప్రస్తుతం నడుస్తున్న ఏఐ, డేటా యుగంలో చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ముందంజ వేస్తోందని అన్నారు. "నౌకా నిర్మాణం, పర్యాటకం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే రక్షణ ఉత్పత్తుల తయారీలో ఏపీలో పనిచేస్తున్నాం" అని తెలిపారు.


More Telugu News