Rajamouli: 'పాస్‌పోర్ట్' పాస్‌లతో మహేశ్-రాజమౌళి మూవీ ఈవెంట్.. సోషల్ మీడియాలో వైరల్!

Rajamouli Mahesh Babu Movie Event Passport Passes Go Viral
  • మహేశ్‌-రాజమౌళి మూవీ ఈవెంట్ కోసం ప్రత్యేక పాస్‌లు
  • అచ్చం పాస్‌పోర్ట్‌ను పోలినట్టుగా క్రియేటివ్ డిజైన్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాస్‌పోర్ట్ పాస్‌లు
  • ఈవెంట్‌కు పాస్‌లు ఉన్నవారికే అనుమతి అని రాజమౌళి స్పష్టీక‌ర‌ణ‌
  • రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్
సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేశ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ కోసం రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే, ఈ ఈవెంట్ కన్నా ముందే అందుకోసం రూపొందించిన పాస్‌లు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానుల కోసం చిత్రబృందం 'పాస్‌పోర్ట్ స్టైల్'లో ప్రత్యేక పాస్‌లను తయారు చేసింది. పసుపు రంగు అట్టతో, దానిపై "GLOBETROTTER EVENT", "PASSPORT" అని ముద్రించి ఉన్నాయి. ప్రీలుక్‌లో మహేశ్‌ మెడలో కనిపించిన త్రిశూలం లోగోను కూడా ఈ పాస్‌పై డిజైన్ చేశారు. లోపల మహేశ్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి ఫొటోలతో పాటు ఈవెంట్ గైడ్‌లైన్స్, మ్యాప్ వంటి వివరాలను పొందుపరిచారు. అచ్చం అసలు పాస్‌పోర్ట్‌లా కనిపించడం దీని ప్రత్యేకత.

ఈ క్రియేటివ్ ఐడియా చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. కేవలం సృజనాత్మకతే కాకుండా దీని వెనుక పక్కా మార్కెటింగ్ వ్యూహం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా వర్కింగ్ టైటిల్ 'గ్లోబ్‌ట్రాటర్'కు తగ్గట్టుగా పాస్‌పోర్ట్ థీమ్‌ను ఎంచుకోవడం ఆసక్తిని పెంచుతోంది.

ఇదే సమయంలో ఈ పాస్‌లపై వస్తున్న ప్రచారానికి దర్శకుడు రాజమౌళి స్వయంగా స్పష్టతనిచ్చారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే ఈవెంట్‌కు అనుమతిస్తామని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులను కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పాత్రలో, ప్రియాంక చోప్రా 'మందాకిని'గా కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన 'సంచారీ' పాట ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. శ్రుతి హాసన్ ఆలపించిన ఈ గీతం ట్రెండింగ్‌లో నిలుస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
Rajamouli
Mahesh Babu Rajamouli movie
SS Rajamouli
Priyanka Chopra
Prithviraj Sukumaran
Globe trotter event
Sanchari song
Ramoji Film City event
Telugu cinema
Pan world project

More Telugu News