Sandeep Chakravarthy: ఒకే ఒక్క పోస్టర్‌తో భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు.. శ్రీనగర్‌లో హీరోగా నిలిచిన మన తెలుగు ఐపీఎస్ ఆఫీసర్

IPS Sandeep Chakravarthy Busts Terror Plot Based on Srinagar Poster
  • శ్రీనగర్‌లో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసిన పోలీసులు
  • సాధారణ పోస్టర్‌తో కుట్రను పసిగట్టిన తెలుగు ఐపీఎస్ సందీప్ చక్రవర్తి
  • దేశవ్యాప్తంగా విస్తరించిన వైట్ కాలర్ టెర్రర్ ముఠా గుట్టురట్టు
  • కర్నూలుకు చెందిన సందీప్ ప్రస్తుతం శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా విధులు
  • ఇప్పటికే ఆరుసార్లు రాష్ట్రపతి శౌర్య పతకం అందుకున్న ధీశాలి
శ్రీనగర్‌లోని ఓ వీధిలో కనిపించిన ఒక సాధారణ పోస్టర్.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఓ భారీ ఉగ్ర కుట్రకు దారితీసింది. ఆ కుట్రను తన అసాధారణ పరిశీలనతో పసిగట్టి, దానిని భగ్నం చేయడంలో కీలక పాత్ర పోషించారు మన తెలుగు తేజం, ఐపీఎస్ అధికారి డాక్టర్ జీఏ సందీప్ చక్రవర్తి. కేవలం ఒక హెచ్చరిక పోస్టర్ ఆధారంగా లోతైన దర్యాప్తు జరిపి, దేశవ్యాప్తంగా విస్తరించిన వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌ను ఆయన బృందం ఛేదించింది.

పోస్టర్‌తో మొదలైన దర్యాప్తు
ఈ ఏడాది అక్టోబర్ 19న శ్రీనగర్‌లోని నౌగామ్ ప్రాంతంలో భద్రతా దళాలను హెచ్చరిస్తూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో కొన్ని పోస్టర్లు వెలిశాయి. చాలామంది దీనిని తేలిగ్గా తీసుకున్నప్పటికీ, శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా పనిచేస్తున్న సందీప్ చక్రవర్తి మాత్రం దానిని తీవ్రంగా పరిగణించారు. ఆ పోస్టర్ల వెనుక పెద్ద కుట్ర దాగివుండొచ్చని అనుమానించి, వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ పోలీసులు హర్యానా, ఉత్తరప్రదేశ్‌ పోలీసుల సహకారంతో ఫరీదాబాద్, సహరాన్‌పూర్‌లలో విస్తృత సోదాలు నిర్వహించారు. వందలాది సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ దర్యాప్తులో విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలున్న డాక్టర్లు, నిపుణులు, విద్యార్థులతో కూడిన ఓ వైట్ కాలర్ ఉగ్రవాద వ్యవస్థ బయటపడింది. జైషే మహమ్మద్ (JeM), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH) వంటి నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న ఈ ముఠాను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. వారి నుంచి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాలు, ఐఈడీల తయారీకి వాడే సామగ్రిని భారీగా స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు బిడ్డ.. కశ్మీర్‌లో ధీశాలి
సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరానికి చెందినవారు. ఆయన తల్లిదండ్రులు రిటైర్డ్ డాక్టర్ జీవీ రామగోపాల్‌రావు, పీసీ రంగమ్మ. కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సందీప్, తొలి ప్రయత్నంలోనే 2014 సివిల్స్‌లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం శ్రీనగర్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా వంటి అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసి విద్రోహ శక్తుల ఏరివేతలో తనదైన ముద్ర వేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు గానూ ఇప్పటివరకు ఆరుసార్లు రాష్ట్రపతి శౌర్య పతకం, నాలుగుసార్లు జమ్మూకశ్మీర్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ పురస్కారాలు అందుకున్నారు.

ఈ విజయంపై సామాజిక మాధ్యమాల్లో సందీప్ పేరు మార్మోగిపోతున్నప్పటికీ, ఆయన తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో వందలాది మంది అధికారుల కృషి ఉందని, ఇంతటి ప్రచారం అతని భద్రతకు ప్రమాదమని వారు అభిప్రాయపడుతున్నారు.
Sandeep Chakravarthy
Srinagar
IPS officer
white collar terror network
Jaish-e-Mohammed
Jammu and Kashmir Police
terrorist plot
Kurnool
Ansar Ghazwat-ul-Hind
security forces

More Telugu News