Global Guardian Terror Index 2026: ఉగ్రవాదంపై తాజా నివేదిక.. ఏయే దేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉందంటే..!

Global Guardian Terror Index 2026 Report on Terrorism
  • గ్లోబల్ గార్డియన్ టెర్రర్ ఇండెక్స్ 2026 విడుదల
  • ఉగ్రవాదంతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో భారత్
  • ఉగ్రవాద కేంద్రం మధ్యప్రాచ్యం నుంచి ఆఫ్రికాకు మారినట్టు వెల్లడి
  • అమెరికా, యూరప్ దేశాల్లోనూ ఉగ్రదాడుల ముప్పు అధికం
  • తీవ్ర ప్రభావిత దేశాల జాబితాలో నైజీరియా, పాకిస్థాన్, సిరియా కూడా 
  • పశ్చిమ దేశాల్లో ఒంటరి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదిక
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెను సవాల్‌గా మారిందని, ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా దేశాలు దీని తీవ్రతతో సతమతమవుతున్నాయని 'గ్లోబల్ గార్డియన్ టెర్రర్ ఇండెక్స్ 2026' నివేదిక స్పష్టం చేసింది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఉగ్రవాదంతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్‌ను కూడా చేర్చింది.

ఈ నివేదిక ప్రకారం, ఆఫ్రికాలోని సుడాన్, మాలి, సోమాలియా, కాంగో వంటి దేశాలతో పాటు ఆసియాలో సిరియా, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ వంటి దేశాలు ఉగ్రవాద కోరల్లో చిక్కుకున్నాయి. 'అత్యంత తీవ్ర' కేటగిరీలో నైజీరియా, మయన్మార్, కొలంబియా, మెక్సికోతో పాటు భారత్ కూడా ఉండటం గమనార్హం. ఈ దేశాల్లో సాయుధ గ్రూపులు, తిరుగుబాటుదారులు హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారని నివేదిక పేర్కొంది.

ఒకప్పుడు ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న మధ్యప్రాచ్యం నుంచి ఇప్పుడు దాని ప్రభావం సబ్-సహారా ఆఫ్రికాకు మారినట్లు ఈ నివేదికలో కీలక అంశాన్ని గుర్తించారు. ఇరాక్, లిబియా వంటి దేశాలు ఇప్పుడు 'అత్యంత తీవ్ర' నుంచి 'అధిక' ప్రభావిత కేటగిరీకి పరిమితమయ్యాయి. బుర్కినా ఫాసో, నైగర్ వంటి దేశాల్లో ముప్పు తీవ్రస్థాయిలో ఉంది.

మరోవైపు, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఉగ్రవాద ముప్పు అధికంగానే ఉందని నివేదిక తెలిపింది. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లతో పాటు అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా దేశాలు 'అధిక' ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, పశ్చిమ యూరప్ దేశాల్లో ఇస్లామిస్ట్ లేదా ఇతర తీవ్రవాద భావజాలంతో ప్రేరేపితమైన 'లోన్-వుల్ఫ్' (ఒంటరి) దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయని వివరించింది.

ప్రపంచంలో చాలా తక్కువ ప్రాంతాలు మాత్రమే ఉగ్రవాదానికి దూరంగా, ప్రశాంతంగా ఉన్నాయని ఈ ర్యాంకింగ్ పేర్కొంది. దక్షిణ-మధ్య ఆఫ్రికా, మధ్య అమెరికా, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో సాపేక్షంగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. ఉగ్రవాద దాడులు, మరణాలు, బాధితుల సంఖ్య, బందీలుగా పట్టుబడిన వారి వివరాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించినట్లు నివేదిక వెల్లడించింది.
Global Guardian Terror Index 2026
Terrorism
Terrorism Africa
Terrorism Asia
Terrorism India
Terrorism Report
Terrorism Index
Terrorist Attacks
Global Terrorism
Terrorism News

More Telugu News