Hero Group: ఏపీలో 4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

Hero Group to Invest in Andhra Pradesh for 4 GW Power Generation
  • రూ.15వేల కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్
  • అనకాపల్లి జిల్లాలో టాయ్ పార్క్ ఏర్పాటు చేయనున్న పాల్స్ ప్లష్ సంస్థ 
  • రామాయపట్నం పోర్టు వద్ద ఫర్నిచర్ క్లస్టర్ సిటీకి స్వీడన్ కు చెందిన జూల్ గ్రూప్ ఆసక్తి
ఏపీలో 4 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.15 వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఈ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.

ముఖ్యమంత్రి సమక్షంలో ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ-ఈడీబీ పరస్పరం సంతకాలు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సీఎండీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ, హైబ్రీడ్ సొల్యూషన్స్ రంగాల్లోనూ పెట్టుబడులతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. డెడికేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.

మరోవైపు రామాయపట్నం వద్ద అత్యాధునిక ఫర్నిచర్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు స్వీడన్ కు చెందిన జూల్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ఫౌండర్ సీఈఓ టామ్ ఓలాండర్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రూ.300 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయనున్నామని జూల్  సంస్థ తెలిపింది. నార్వే, స్వీడన్ల నుంచి భారీ దుంగలను దిగుమతి చేసుకుని డోర్లు, విండోలు లాంటి ఉత్పత్తులతో పాటు ప్రీ ఫాబ్రికేషన్ విధానంలో ఇళ్లను కూడా రూపొందిస్తామని జూల్ సీఈఓ టామ్ ఓలాండర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టు సమీపంలో 500 ఎకరాల్లో ఫర్నిచర్ క్లస్టర్ సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

అమరావతి నగరంతో పాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. అనంతరం ప్రముఖ ఆటబొమ్మల తయారీ సంస్థ పాల్స్ ప్లష్ టాయ్స్ సంస్థ అధ్యక్షుడు అజయ్ సిన్హా ముఖ్యమంత్రిని కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద టాయ్ పార్క్ ఏర్పాటుపై చర్చించారు. చైనా తరహాలో ఆట బొమ్మల తయారీకి సంబంధించిన ఎకోసిస్టమ్‌ను తయారు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం బొమ్మల తయారీలో స్థానికంగా ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలని ఆ సంస్థ ప్రతినిధుల్ని కోరారు.
Hero Group
Hero Future Energies
Andhra Pradesh
Renewable energy
Rahul Munjal

More Telugu News