Chandrababu: ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తాం: భారత్-ఈయూ సదస్సులో సీఎం చంద్రబాబు

Andhra Pradesh to Become Green Hydrogen Valley Says Chandrababu at EU Summit
  • ముగిసిన భారత్-ఈయూ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం
  • గ్రీన్ ఎనర్జీయే ప్రపంచానికి కీలకమని స్పష్టం చేసిన చంద్రబాబు
  • ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటన
  • నౌకా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని విదేశీ సంస్థలకు పిలుపు
  • ప్రకృతి విపత్తులకు భూతాపమే కారణమని ఆందోళన
భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. సుస్థిరాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతపై కీలక ప్రసంగం చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ను 'గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ'గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోవడం వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "క్లౌడ్ బరస్ట్ వంటి ఘటనలతో నగరాలు నీట మునుగుతున్నాయి. ఒకేచోట 40 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం వంటి తీవ్ర పరిణామాలు గ్లోబల్ వార్మింగ్ వల్లే సంభవిస్తున్నాయి. ఈ ఉత్పాతాలను ఎదుర్కోవాలంటే మనమంతా కలిసి గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలి" అని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి రానున్న డేటా సెంటర్లకు కూడా గ్రీన్ ఎనర్జీనే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్, ఈయూ మరింత సమర్థంగా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ సదస్సులో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం భారత్ నౌకా నిర్మాణ రంగంలో వెనుకబడి ఉంది. ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు రావాలి" అని విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

గ్రీన్ ఎనర్జీతో పాటు ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల రంగంలోనూ ఏపీ కీలకంగా పనిచేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకృతి సేద్యంలో పండించిన 'అరకు కాఫీ' ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. మానవాళి సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. 
Chandrababu
Andhra Pradesh
Green Hydrogen Valley
India EU Summit
Sustainable Development
Green Energy
Global Warming
Investments
Organic Food
Araku Coffee

More Telugu News