Epstein files: ఎప్ స్టీన్ ఈమెయిల్ లో ట్రంప్ పేరు.. సంచలన ఈమెయిల్ బయటపెట్టిన డెమోక్రాట్లు

Donald Trump Named in Jeffrey Epstein Email Released by Democrats
  • ఓ బాధితురాలితో ట్రంప్ గంటల పాటు ఉన్నారని మెయిల్ లో పేర్కొన్న ఎప్ స్టీన్
  • ఈ మెయిల్ ను ఆయన తన సహచరురాలికి పంపినట్లు వెల్లడించిన డెమోక్రాట్లు
  • 2011 ఏప్రిల్‌ 2న ఎప్ స్టీన్ పంపిన మెయిల్ లో ట్రంప్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్య
అమెరికాను వణికించిన జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ లో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్ స్టీన్ తన సన్నిహితురాలికి పంపిన ఓ మెయిల్ ను తాజాగా డెమోక్రాట్ నేతలు విడుదల చేశారు. ఈ ఈమెయిల్ లో అమెరికా ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి ఎప్ స్టీన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ట్రంప్ ఓ మొరగని కుక్క అనే విషయం నువ్వు తెలుసుకోవాలి.  ఓ బాలిక కొన్ని గంటలపాటు అతడితో మా ఇంట్లో గడిపింది. అయితే అతడి పేరు ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు’ అని ఎప్ స్టీన్ పేర్కొన్నాడు. 2011 ఏప్రిల్‌ 2వ తేదీన తన స్నేహితురాలు గ్లీస్లెయిన్‌ మ్యాక్స్‌వెల్‌ కు పంపిన ఈ మెయిల్ లో ఎప్ స్టీన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎప్‌ స్టీన్‌ సిబ్బంది హౌస్‌ కమిటీకి అందించిన 23 వేల పత్రాల్లో ఈ ఈమెయిల్ ఒకటని డెమోక్రాట్ నేతలు చెప్పారు.

ఎవరీ ఎప్ స్టీన్..?
అమెరికాకు చెందిన అత్యంత సంపన్నుల్లో జెఫ్రీ ఎప్ స్టీన్ ఒకడు. ఆయన ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. అమెరికాలోని ధనవంతులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఎప్ స్టీన్ తరచుగా అక్కడ ఖరీదైన పార్టీలు ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే పలువురు మైనర్లతో పాటు మహిళలను అక్రమ లైంగిక సంబంధాలకు వాడుకున్నాడనే నేరారోపణతో ఎప్ స్టీన్ జైలుపాలయ్యాడు. విచారణ జరుగుతుండగానే జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలువురు ప్రముఖులకు మైనర్లతో విందులు ఏర్పాటు చేశారని ఆరోపణలు వెలువడ్డాయి.

ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఎప్ స్టీన్ ఫైల్స్ పేరుతో వెలుగుచూడడం అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి నేరస్థుడితో ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవని డెమోక్రాట్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. తాజాగా బయటపెట్టిన ఎప్ స్టీన్ ఈ మెయిల్ లో ట్రంప్ పేరు బయటపడడం మరోమారు సంచలనం సృష్టించింది.
Epstein files
Donald Trump
Jeffrey Epstein
Glieslaine Maxwell
US Politics
Democrats
Epstein email
Minor abuse case
America
Political scandal

More Telugu News