టాలీవుడ్‌లో మాటల యుద్ధం: బండ్ల వ్యాఖ్యలకు ఎస్‌కేఎన్ కౌంటర్!

  • విజయ్ దేవరకొండను ఉద్దేశించి బండ్ల గణేశ్ పరోక్ష విమర్శలు
  • బండ్ల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన నిర్మాత ఎస్‌కేఎన్
  • 'ది గర్ల్‌ఫ్రెండ్' వేదికపై విజయ్‌కు ఎస్‌కేఎన్ పూర్తి మద్దతు
టాలీవుడ్‌లో ఈ మధ్య సినిమా ఈవెంట్లు మాటల యుద్ధాలకు వేదికగా మారుతున్నాయి. కొందరు సెలబ్రిటీలు ఉత్సాహంతోనో, భావోద్వేగంతోనో చేసే వ్యాఖ్యలు పెద్ద వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా నిర్మాత బండ్ల గణేశ్, మరో నిర్మాత ఎస్‌కేఎన్ మధ్య పరోక్షంగా సాగుతున్న మాటల యుద్ధం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండను ఉద్దేశించి బండ్ల చేసిన వ్యాఖ్యలకు ఎస్‌కేఎన్ గట్టి కౌంటర్ ఇచ్చారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

విషయం ఏమిటంటే..
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో వచ్చిన 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ విజయ్‌ను ఆకాశానికెత్తేశారు. "రాజు అప్పుడప్పుడూ కనిపించకపోవచ్చు కానీ ప్రిన్స్ ఎప్పటికీ ప్రిన్సే. సింహం అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహమే. మరో 6-9 నెలల్లో విజయ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడు. ఒక్కసారి కొడితే ఫ్లూక్ అంటారు, రెండోసారి కొడితే ఫేక్ అంటారు, మూడోసారి కొడితే ఇండస్ట్రీ షేక్ అంటారు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కొన్ని రోజుల క్రితం 'కె ర్యాంప్' అనే సినిమా ఈవెంట్‌లో బండ్ల గణేశ్ మాట్లాడుతూ, "కొంతమందికి ఒకట్రెండు హిట్లు రాగానే లూజ్ ప్యాంట్లు, కళ్లజోడు వేసుకుని వాట్సప్ అంటూ ఓవరాక్షన్ చేస్తారు" అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండను లక్ష్యంగా చేసుకుని చేసినవేనని పెద్ద దుమారం రేగింది. విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బండ్లపై తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత తాను ఎవరినీ ఉద్దేశించి అనలేదని బండ్ల వివరణ ఇచ్చినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌కేఎన్ వ్యాఖ్యలను బండ్లకు కౌంటర్‌గా చూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో 'తెలుసు కదా' సినిమా సక్సెస్ మీట్‌లో ఇదే ఎస్‌కేఎన్, బండ్ల గణేశ్ ను పొగడ్తలతో ముంచెత్తారని గుర్తుచేస్తున్నారు. "మొన్నటి వరకు బండ్లను పొగిడిన నువ్వేనా, ఇప్పుడు విజయ్ మెప్పు కోసం ఆయన్ను టార్గెట్ చేసేది?" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.


More Telugu News