Nara Lokesh: అమీర్‌పేట కోచింగ్ సెంటర్లు 3 నెలల శిక్షణతోనే అవకాశాలు కల్పిస్తున్నాయి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Focuses on Skill Development for APs Economic Growth
  • అమరావతిలో 'హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ – 2025’
  • ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేశ్ 
  • భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యమని వెల్లడి
  • ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు అత్యవసరని ఉద్ఘాటన 
  • నైపుణ్యాల కొరతను అధిగమించేందుకు స్కిల్ సెన్సస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని, అయితే మన అసలైన లక్ష్యం దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమేనని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ బృహత్తర లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలంటే ఉన్నత విద్యారంగంలో సమూలమైన సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో సీఐఐ సదరన్ రీజియన్, విట్-ఏపీ సంయుక్తంగా నిర్వహించిన ‘హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ – 2025’కు లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

'భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉన్నత విద్యను పునఃరూపకల్పన చేయడం' అనే థీమ్‌తో ఈ సదస్సును ఏర్పాటు చేశారని, అయితే తాను ఈ అంశంతో పూర్తిగా ఏకీభవించడం లేదని లోకేశ్ అన్నారు. "5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం మనకు అత్యంత సమీపంలో ఉంది. దానిని మనం సులభంగానే చేరుకుంటాం. కానీ, అసలు ప్రశ్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదగాలన్నదే. మానవ వనరులు, మేధోసంపద లేకుండా ఇంతటి ఆర్థికవృద్ధి అసాధ్యం. ఈ మహోన్నత లక్ష్య సాధనలో మన ఉన్నత విద్యారంగమే వ్యూహాత్మక మూలస్తంభంలా పనిచేయాలి" అని ఆయన దిశానిర్దేశం చేశారు.

నైపుణ్యాల కొరత అతిపెద్ద సవాలు

ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నైపుణ్యాల కొరత అని లోకేశ్ అన్నారు. ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం మన గ్రాడ్యుయేట్లలో కేవలం 51 శాతం మాత్రమే ఉద్యోగాలకు అర్హులుగా ఉన్నారని, ఇది మన యువత మేధస్సు లోపం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

"మనం బోధించే అంశాలకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అసమతుల్యతే దీనికి ప్రధాన కారణం. మన విద్యాసంస్థల్లో 3-4 ఏళ్ల కోర్సులు పూర్తి చేసినా యువతకు ఉద్యోగాలు రావడం లేదు. కానీ, హైదరాబాద్ అమీర్‌పేటలోని కోచింగ్ సెంటర్లు కేవలం 3-4 నెలల శిక్షణతోనే వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ అంతరాన్ని పూడ్చడానికే ఉన్నత విద్యలో ప్రాథమిక మార్పులు రావాలి. డిగ్రీలతో పాటు క్రియాశీల నైపుణ్యాలపై దృష్టి సారించాలి" అని లోకేశ్ పిలుపునిచ్చారు.

భారత జనాభాలో 54 శాతం మంది 25 ఏళ్లలోపు వారేనని, ఇది మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని ఆయన గుర్తుచేశారు. అయితే, దక్షిణ కొరియాలో 96 శాతం, జపాన్‌లో 80 శాతం, జర్మనీలో 75 శాతం మందికి నైపుణ్య శిక్షణ ఉండగా, మన దేశంలో అది కేవలం 34.7 శాతం మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దినప్పుడే వారు దేశానికి నిజమైన ఆస్తిగా మారతారని అన్నారు.

‘స్కిల్ సెన్సస్’తో అంతరానికి చెక్

ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాల అంతరాన్ని (స్కిల్ గ్యాప్) భర్తీ చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తమ ప్రభుత్వం ‘స్కిల్ సెన్సస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని లోకేశ్ వెల్లడించారు. 

"16 నెలల క్రితం ఏర్పడిన మా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని నా సొంత నియోజకవర్గం మంగళగిరి నుంచే ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి నైపుణ్యాలను అంచనా వేసి, లోటుపాట్లను గుర్తిస్తాం. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు సిద్ధం చేయడమే దీని లక్ష్యం. దీనికి అనుబంధంగా ‘నైపుణ్యం పోర్టల్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా త్వరలో ప్రారంభిస్తాం" అని తెలిపారు.

స్వర్ణాంధ్ర లక్ష్యంతో ముందుకు

ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా, తాము ‘విజన్-2047: స్వర్ణ ఆంధ్ర’ డాక్యుమెంట్‌తో ముందుకు సాగుతున్నామని లోకేశ్ ప్రకటించారు. "2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం మా లక్ష్యం. 2029 నాటికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే మా ధ్యేయం. ఇప్పటికే గత 17 నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాం. త్వరలో జరగబోయే సదస్సులో మరో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలోపేతమవుతుంది" అని అన్నారు.

విద్యా వ్యవస్థలో పంచ సూత్రాలు

ఉన్నత విద్యారంగాన్ని నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు ఐదు కీలక అంశాలపై దృష్టి సారించామని లోకేష్ వివరించారు.
1. కరిక్యులమ్ టు కెరీర్: పరిశ్రమలతో కలిసి సిలబస్ రూపొందించి, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడం.
2. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్: ప్రతి విశ్వవిద్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంక్యుబేషన్ హబ్‌లు, స్టార్టప్ కేంద్రాలు ఏర్పాటు చేయడం.
3. డిజిటల్ నైపుణ్యాలు: ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్ వంటి ఆధునిక కోర్సులను విస్తరించడం.
4. అంతర్జాతీయీకరణ: ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని, విద్యను సాఫ్ట్ పవర్‌గా మార్చడం.
5. ప్రాంతీయ సమతుల్యత: పారిశ్రామికీకరణ కోసం క్లస్టర్ ఆధారిత విధానాన్ని అనుసరించడం.

ఈ కార్యక్రమంలో సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ అశ్విన్ మహాలింగం, విట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వం, ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ కె.రత్నషీలామణి తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Skill Development
Higher Education
5 Trillion Economy
Skill Census
Amirpet Coaching Centers
Chandrababu Naidu
Digital Skills
AP Economy

More Telugu News