Raghunandan Rao: అసలు బాంబు పేలుళ్లకు, బీజేపీకి ఏం సంబంధం?: రఘునందన్ రావు ఫైర్

Raghunandan Rao Fires Over BJP Link to Bomb Blasts
  • ఢిల్లీ పేలుళ్లపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ ఆగ్రహం
  • బీజేపీకి సంబంధం ఉందంటూ పోస్టులు పెట్టడం దేశద్రోహమేనని వ్యాఖ్య
  • చేతిలో ఫోన్ ఉందని ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శ
ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనను బీజేపీకి ఆపాదిస్తూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం దేశద్రోహం కిందికే వస్తుందని ఆయన హెచ్చరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలో నిర్వహించిన 'సర్దార్-ఏక్తా పాదయాత్ర'లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

"చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే పేలుళ్లు జరుగుతాయని, దీని వెనుక బీజేపీ ఉందని నీచంగా మాట్లాడుతున్నారు. అసలు బాంబు పేలుళ్లకు, బీజేపీకి ఏం సంబంధం?" అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని, ప్రజలు ఎవరూ ఇలాంటి వారిని సమర్థించవద్దని ఆయన కోరారు.

ఢిల్లీలో బాంబులు పేల్చాలని ఒక వర్గం వారు కుట్ర పన్నారని, ఇప్పుడు ఆ నెపాన్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఉగ్రవాద చర్యలను ఖండించాల్సింది పోయి, ఒక రాజకీయ పార్టీపై బురద చల్లడం దారుణమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 
Raghunandan Rao
Delhi Bomb Blast
BJP
Sangareddy
Sardar Patel
Ekta Padyatra
Social Media
Fake News
Terrorism
Political Conspiracy

More Telugu News