Kalvakuntla Kavitha: జాగృతి సంస్థతో పెట్టుకున్న వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు: కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha Warns Those Who Mess with Jagruthi
  • ప్రజా సమస్యలు గుర్తించి ప్రభుత్వంతో పరిష్కారం చేయించడమే జాగృతి లక్ష్యమన్న కవిత
  • నల్గొండ జిల్లాలో కీలక నేతలు ఉన్నా అభివృద్ధిలో వెనుకబడిందన్న కవిత
  • జిల్లా కేంద్రంలో ఉన్న తన ఫ్లెక్సీని చించివేయడం సరికాదన్న కవిత
తెలంగాణ జాగృతి సంస్థతో పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వంతో పరిష్కారం చేయించడమే తెలంగాణ జాగృతి లక్ష్యమని అన్నారు. ఆసుపత్రుల్లో సిబ్బంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.

జిల్లాలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి పెద్ద నాయకులు ఉన్నప్పటికీ, జిల్లా అభివృద్ధిలో వెనుకంజలో ఉందని విమర్శించారు.

జిల్లా కేంద్రంలో ఉన్న తన ఫ్లెక్సీని చించివేయడం సరికాదని ఆమె అన్నారు. జిల్లాలో ప్రతిపక్షం లేకపోవడంతో అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు జాగృతిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆమె అన్నారు.
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Nalgonda
Mata Sishu Samrakshana Kendra
Uttam Kumar Reddy

More Telugu News