‘శివ’ చైల్డ్ ఆర్టిస్ట్‌ సుష్మకు క్షమాపణ చెప్పిన వర్మ.. ఇప్పుడామె ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసా?

Ram Gopal Varma apologizes to Shiva child artist Sushma
  • 'శివ' సినిమాలోని బాలనటి సుష్మ ఫొటోను పంచుకున్న వర్మ
  • యూఎస్‌లో ఏఐ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నట్టు వెల్లడి
  • సైకిల్ ఛేజ్ సీన్‌లో రిస్కీ షాట్స్ పట్ల క్షమాపణలు కోరిన ఆర్జీవీ
టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ మూవీ ‘శివ’ గురించి, అందులోని సైకిల్ ఛేజ్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఆ సీన్‌లో నటించిన బాలనటికి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ 36 ఏళ్ల తర్వాత క్షమాపణలు చెప్పారు. ఆ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలియజేస్తూ ఓ ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘శివ’ సినిమాలో హీరో నాగార్జున అన్నయ్య కూతురిగా సుష్మ అనే బాలనటి నటించింది. ఆమెను హీరో సైకిల్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తుండగా విలన్లు వెంబడించే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఆ సీన్‌ను గుర్తుచేసుకుంటూ సుష్మ ఇప్పటి ఫొటోను వర్మ షేర్ చేశారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కాగ్నిటివ్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా సుష్మను క్షమాపణ కోరుతూ వర్మ ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘సుష్మ.. నువ్వు చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. ఆ రిస్కీ షాట్‌తో నువ్వు ఎంతగా భయపడ్డావో ఒక దర్శకుడిగా అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. దయచేసి అంగీకరించు’’ అని వర్మ విజ్ఞప్తి చేశారు.

అత్యంత ప్రమాదకరమైన ఆ సైకిల్ ఛేజ్ సీక్వెన్స్‌ను ఎలాంటి డూప్ లేకుండా చిత్రీకరించినట్టు హీరో నాగార్జున సైతం ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఆ సీన్‌లో నటించిన చిన్నారి భద్రతపై వర్మ ఇప్పుడు స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ‘శివ’ సినిమాను ఈ తరం ప్రేక్షకుల కోసం ఈ నెల 14న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా వర్మ పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
Go Back to Shorts
Ram Gopal Varma
Shiva movie
Sushma
Nagarjuna
Cycle chase scene
AI research
Artificial intelligence
Telugu cinema
Movie re-release

More Telugu News