గెలవడం మాట అటుంచితే, ఎన్నికలను భారీగా ప్రభావితం చేశాడట.. ప్రశాంత్ కిశోర్ పార్టీపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

  • బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఎఫెక్ట్ భారీగా ఉందంటున్న నిపుణులు
  • అయితే ఆకాశాన్ని అందుకుంటామని, లేదంటే పాతాళానికి పడిపోతామని అన్న ప్రశాంత్ కిశోర్
  • జన్ సురాజ్ పార్టీకి గరిష్ఠంగా 5 సీట్లకు మించి రావంటున్న ఎగ్జిట్ పోల్స్
బీహార్ లో రెండు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వైపే ఓటర్లు మొగ్గు చూపారని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మరోమారు నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పడనుందని స్పష్టం చేశాయి. మెజారిటీ సీట్లను ఎన్డీయే కూటమి గెల్చుకుంటుందని తెలిపాయి. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్ కన్నా తేజస్వీ యాదవ్ బెటర్ అని చాలామంది ఓటర్లు అభిప్రాయపడ్డారని పలు సర్వేలు తేల్చాయి. సీఎంగా ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు 30 శాతం మంది నితీశ్ కు, 32 శాతం మంది తేజస్వీ యాదవ్ కు మొగ్గుచూపారని వివరించాయి.

జన్ సురాజ్ పార్టీ ప్రభావం..
ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీ పెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ జన్ సురాజ్ తరఫున పలువురు అభ్యర్థులను బరిలోకి దించారు. ఎగ్జిట్ పోల్స్ లో జన్ సురాజ్ పార్టీ గరిష్ఠంగా ఐదు సీట్లు గెల్చుకోవచ్చని అంచనా వేశాయి. అయితే, సీట్ల విషయం పక్కన పెడితే ఈ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ భారీగా ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సింగిల్ సీటు గెల్చుకోకున్నా సరే జన్ సురాజ్ పార్టీ పలు సీట్లలో అభ్యర్థుల తలరాతను మార్చేసిందని చెబుతున్నారు.

ఓట్ షేర్ లో భారీగా ప్రభావం..
అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఖాతా తెరిచే పరిస్థితే లేదు.. కానీ ఓట్ షేర్ లో మాత్రం ఆ పార్టీ ప్రభావం భారీగా పడిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను, ఎన్డీయే కూటమి వ్యతిరేక ఓట్లను జన్ సురాజ్ పార్టీ చీల్చిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం వల్ల ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ కూటమి తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. దీనివల్ల అంతిమంగా అధికార ఎన్డీయే కూటమికే ప్రయోజనం కలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.

పీకే ఏమన్నారంటే..
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోందనే దానిపై ప్రశాంత్ కిశోర్ కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ.. ‘అయితే ఆకాశాన్ని అందుకుంటాం, లేదంటే పాతాళానికి పడిపోతాం’ అని పేర్కొన్నారు. ఏదేమైనా సరే తమ పార్టీ పొత్తులకు వ్యతిరేకమని, ఫలితాల్లో కింగ్ మేకర్ గా అవతరించినా సరే తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.


More Telugu News