Babar Azam: కోహ్లీ చెత్త రికార్డును సమం చేసిన బాబర్ ఆజం

Babar Azam Equals Virat Kohlis Unwanted Tally After Another ODI Flop Show
  • శ్రీలంకతో వన్డేలో మరోసారి విఫలమైన బాబర్ ఆజం
  • హసరంగ అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయిన పాక్ బ్యాటర్
  • శతకం లేకుండా 83 ఇన్నింగ్స్‌ల పూర్తి
  • విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అవాంఛిత రికార్డు సమం
  • ఆసియా బ్యాటర్లలో జయసూర్య (88) టాప్‌
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పేలవ ఫామ్ కొనసాగుతోంది. శ్రీలంకతో రావల్పిండి వేదికగా నిన్న‌ జరిగిన తొలి వన్డేలో అతను మరోసారి విఫలమయ్యాడు. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ వేసిన ఒక అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయి నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న బాబర్ కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు.

పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో 24వ ఓవర్ వేసిన హసరంగ.. బాబర్‌ను పూర్తిగా బోల్తా కొట్టించాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతి అనూహ్యంగా టర్న్ అయి, బాబర్ బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలో నుంచి దూసుకెళ్లి వికెట్లను గిరాటేసింది. ఆ బంతి స్పిన్ అయిన తీరు చూసి బాబర్ ఆజం బిత్తరపోయాడు. శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య సైతం ఈ వికెట్‌కు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆయన స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాబ‌ర్ ఖాతాలో అవాంఛిత రికార్డు
ఈ ఇన్నింగ్స్‌తో బాబర్ ఆజం అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతను సెంచరీ చేయకుండా వరుసగా 83 ఇన్నింగ్స్‌లు పూర్తి చేశాడు. చివరిసారిగా 2023 ఆసియా కప్‌లో నేపాల్‌పై బాబర్ శతకం సాధించాడు. సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన రికార్డులో అతను విరాట్ కోహ్లీ (83) సరసన నిలిచాడు. ఆసియా బ్యాటర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య (88 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.


Babar Azam
Pakistan cricket
Sri Lanka
Virat Kohli
Sanath Jayasuriya
Wanindu Hasaranga
Rawalpindi ODI
cricket record
Asia Cup
century drought

More Telugu News