Dharma Reddy: కల్తీ నెయ్యి కేసు: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించిన సిట్ అధికారులు

Dharma Reddy Questioned in Fake Ghee Case Supplying TTD
  • 8 గంటలకు పైగా ప్రశ్నించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)
  • 'హైకమాండ్' ఒత్తిడి వల్లేనని చెప్పినట్లు సమాచారం
  • నేడు కూడా కొనసాగనున్న ధర్మారెడ్డి విచారణ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు, మధ్యలో గంట భోజన విరామంతో కలిపి దాదాపు 8 గంటల పాటు డీఐజీ మురళీ రాంబా నేతృత్వంలోని బృందం ఆయనను ప్రశ్నించింది.

లడ్డూకు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరించారని ప్రశ్నించగా.. 'హైకమాండ్' ఒత్తిడి వల్లే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఆ హైకమాండ్ ఎవరనే ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. ధర్మారెడ్డి పలు ప్రశ్నలకు క్లుప్తంగా బదులివ్వగా, మరికొన్నింటికి మౌనం వహించారని సమాచారం.

2022 ఆగస్టులోనే మైసూరు ల్యాబ్ నుంచి నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు, భోలేబాబా డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టేందుకే టెండర్ నిబంధనల్లో మార్పులు చేశారా, గతంలో ఉన్న 'మిల్క్' (పాలు) పదాన్ని 2020లో ఎందుకు తొలగించారు, తిరిగి 2023లో ఎందుకు చేర్చారు, ఈ మార్పుల ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చారు తదితర ప్రశ్నలను సిట్ అధికారులు సంధించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టై బెయిల్‌పై ఉన్న భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌లను కూడా సిట్ విచారించింది. ఐదేళ్లలో ఈ సంస్థ రూ.251 కోట్లకు పైగా విలువైన 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని డీఐజీ మురళీ రాంబా వెల్లడించారు. ఈ వ్యవహారంలో గత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపైనా అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాగా, రాత్రి విచారణ ముగిసిన అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈరోజు కూడా ఆయన విచారణ కొనసాగనుండటంతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
Dharma Reddy
TTD
Tirumala
Fake Ghee
YV Subba Reddy
SIT Investigation
Ladoo Prasadam
Bhole Baba Dairy
AP Government
Tender Process

More Telugu News