Chandrababu Naidu: అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్... ఏపీ సమస్యలు వివరించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu briefs Central Minister Shivraj Singh on AP issues
  • సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ
  • గంటపాటు కొనసాగిన కీలక సమావేశం
  • రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి అంశాలపై చర్చ
  • మొంథా తుపాను నష్టాన్ని వివరించిన ముఖ్యమంత్రి
  • రైతుల కోసం రూ. 695 కోట్ల అదనపు నిధులు కోరిన సీఎం
  • తోతాపూరి రైతులకు రూ. 100 కోట్లు విడుదల చేయాలని వినతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ అయ్యారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం నాడు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల సంక్షేమానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ సహకారంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన 'మొంథా' తుపాను వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలను సీఎం కేంద్ర మంత్రి ముందుంచారు. పీఎం-ఆర్కేవీవై-పీడీఎంసీ (ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన - పర్ డ్రాప్ మోర్ క్రాప్) పథకం కింద రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి రూ. 695 కోట్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.

అదేవిధంగా, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద తోతాపూరి మామిడి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను చంద్రబాబు వివరించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా రూ. 100 కోట్లను వెంటనే విడుదల చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. రాష్ట్ర రైతాంగ సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Shivraj Singh Chouhan
AP CM
Central Minister
Cyclone Montha
Agriculture
Farmer Welfare
PM Krishi Vikas Yojana
Mango Farmers

More Telugu News