Nalin Haley: తల్లికి పూర్తి భిన్నంగా కుమారుడు... హెచ్-1బీ వీసాలు పూర్తిగా రద్దు చేయాలన్న నిక్కీ హేలీ కుమారుడు నలిన్ హేలీ

Nikki Haleys Son Nalin Haley Demands End to H 1B Visas Legal Immigration
  • నిక్కీ హేలీ కుమారుడి సంచలన వ్యాఖ్యలు
  • హెచ్-1బీ వీసాలు, చట్టబద్ధ వలసలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్
  • అమెరికన్ యువతకు ఉద్యోగాలు దొరకడం లేదని ఆవేదన
  • భారత సంతతి జర్నలిస్ట్ మెహదీ హసన్‌ను దేశం నుంచి పంపేయాలని వ్యాఖ్య
  • పెరిగిన జీవన వ్యయమే తన అభిప్రాయానికి కారణమని వెల్లడి
అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ కుమారుడు నలిన్ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లి వైఖరికి పూర్తి విరుద్ధంగా, అమెరికాలో హెచ్-1బీ వీసాలతో పాటు చట్టబద్ధమైన వలసలను కూడా పూర్తిగా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో విదేశీయులకు అవకాశం ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

లండన్‌కు చెందిన 'అన్‌హర్డ్' అనే న్యూస్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 24 ఏళ్ల నలిన్ హేలీ ఈ వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం అమెరికన్ యువతకు ఉద్యోగాలు దొరకడం లేదు. నా స్నేహితుల బృందంలో అందరూ మంచి యూనివర్సిటీల నుంచి డిగ్రీలు పూర్తి చేశారు. ఏడాదిన్నర గడిచినా వారిలో ఒక్కరికీ సరైన ఉద్యోగం రాలేదు. అందువల్ల ప్రభుత్వం వెంటనే హెచ్-1బీ వీసాలను రద్దు చేయాలి. చట్టబద్ధమైన వలసలను కూడా పూర్తిగా ఆపేయాలి" అని ఆయన స్పష్టం చేశారు.

తల్లి విధానాలకు వ్యతిరేకంగా...
నలిన్ అభిప్రాయాలు ఆయన తల్లి, ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి అయిన నిక్కీ హేలీ విధానాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నిక్కీ హేలీ ఎప్పుడూ ప్రతిభ ఆధారిత వలసలకు మద్దతుగా నిలుస్తారు. తన తల్లిదండ్రులు పంజాబ్ నుంచి వలస వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, చట్టబద్ధమైన వలసలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. అలాంటిది ఆమె కుమారుడు వలసలకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

జర్నలిస్ట్‌పై తీవ్ర వ్యాఖ్యలు
ఇదే ఇంటర్వ్యూలో, భారత సంతతికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ మెహదీ హసన్‌ను దేశం నుంచి పంపించివేయాలని నలిన్ వ్యాఖ్యానించారు. "అతనికి అమెరికా అంటే ఇష్టం లేదు. అమెరికా నచ్చని వారు ఇక్కడ ఉండకూడదు. పాత తరం వారు నియమాలు, నిబంధనల గురించి మాట్లాడతారు. దేశం నచ్చకపోతే వెళ్లిపోవాలి" అని ఆయన అన్నారు. హైదరాబాద్ మూలాలున్న మెహదీ హసన్, ట్రంప్ వలస విధానాలను తీవ్రంగా విమర్శిస్తుంటారు.

మరోవైపు, అమెరికాలో జీవన వ్యయం, ముఖ్యంగా ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని నలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. "మా అమ్మానాన్నలు వారి మొదటి ఇంటిని 90,000 డాలర్లకు కొన్నారు. ఇప్పుడు దాని విలువ 4 లక్షల డాలర్లకు పైనే ఉంటుంది. ఈ ధరలతో మా తరం ఎలా పోటీ పడగలుగుతుంది?" అని ప్రశ్నించారు. వలసలను నియంత్రిస్తేనే అమెరికన్లకు ఉద్యోగ, గృహ అవకాశాలు మెరుగవుతాయని ఆయన వాదించారు. అమెరికాలో 2026 మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలస విధానాలపై నలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Nalin Haley
Nikki Haley
H-1B visas
US Immigration
Indian American
Mehdi Hasan
US elections 2026
Immigration policy
Job market
American youth

More Telugu News