Jackie Chan: జాకీ చాన్‌పై సోషల్ మీడియాలో వదంతులు.. అసలు నిజమిదే!

Jackie Chan Death Hoax Debunked Actor Alive and Well
  • జాకీ చాన్ చనిపోయారంటూ వదంతులు
  • ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసిన ఫ్యాన్స్
  • గతంలోనూ పలుమార్లు జాకీ చాన్‌పై దుష్ప్రచారం
ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్‌స్టార్ జాకీ చాన్ మరణించారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త నిన్న తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తేలింది.

వివరాల్లోకి వెళితే, జాకీ చాన్ ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉన్నట్లుగా ఉన్న ఒక ఫొటో నిన్న ఫేస్‌బుక్‌లో వైరల్ అయింది. "ప్రపంచ సినిమాకే అత్యంత ఇష్టమైన వ్యక్తి, మనందరి హృదయాలను గెలుచుకున్న గొప్ప నటుడు, కుంగ్ ఫూ యోధుడు, నవ్వుల రారాజు జాకీ చాన్ ఈ రోజు కన్నుమూశారు" అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆయన కుటుంబ సభ్యులే ఈ విషయాన్ని ధృవీకరించారని ఆ పోస్ట్ లో పేర్కొనడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అయితే, కొద్దిసేపటికే ఇది తప్పుడు వార్త అని గ్రహించిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఫేస్‌బుక్ ఎందుకు జాకీ చాన్‌ను చంపాలని చూస్తోంది?" అని ఒకరు ప్రశ్నించగా, "ఈ వార్త చూసి ఆఫీసులో గట్టిగా అరవబోయాను" అని మరో యూజర్ కామెంట్ చేశారు. "జాకీ చాన్ మరణించారనేది ఫేస్‌బుక్ తాజా ఫేక్ న్యూస్. ఆయన చనిపోలేదు" అంటూ పలువురు ఈ వదంతులను ఖండించారు.

జాకీ చాన్‌పై ఇలాంటి మరణవార్తలు ప్రచారంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు ఆయన మరణించారంటూ వదంతులు వ్యాపించాయి. ప్రతీసారి ఆయన వాటిని ఖండిస్తూ, తాను ఆరోగ్యంగానే ఉన్నానని అభిమానులకు భరోసా ఇస్తూ వచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే, జాకీ చాన్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'రష్ అవర్', 'ది కరాటే కిడ్' వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, ప్రస్తుతం 'న్యూ పోలీస్ స్టోరీ 2', 'ప్రాజెక్ట్ పి', 'ఫైవ్ ఎగైనెస్ట్ ఎ బుల్లెట్' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన 'రష్ అవర్ 4' సినిమా పనుల్లో కూడా నిమగ్నమైనట్లు సమాచారం.
Jackie Chan
Jackie Chan death hoax
Jackie Chan alive
Rush Hour 4
New Police Story 2
Project P
Five Against a Bullet
social media rumors
actor
kung fu

More Telugu News