Delhi Blast: ఢిల్లీని వణికించిన కారు.. చాలా చేతులు మారిందా?.. దర్యాప్తులో కీలక విషయాలు

Red Fort Blast Delhi Car Used Changed Many Hands Investigation Reveals
  • ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు
  • హ‌ర్యానాలోని ఫరీదాబాద్‌లో కారు కొనుగోలు చేసినట్టు గుర్తింపు
  • ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధాలున్నట్టు పోలీసుల అనుమానం
  • 100కు పైగా సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్న దర్యాప్తు బృందాలు
  • అనుమానితుడు ఒంటరిగానే కారును పార్క్ చేసినట్టు గుర్తింపు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దాడికి ఉపయోగించిన హ్యుందాయ్ ఐ20 కారును హర్యానాలోని ఫరీదాబాద్ సెక్టార్ 37లో ఉన్న ఒక సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ వద్ద కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 

ప‌లు చేతులు మారిన కారు చివ‌రికి ఉమర్ వద్దకు
పోలీసుల దర్యాప్తు ప్రకారం ఈ కారు పలు చేతులు మారింది. తొలుత ఈ వాహనం మహమ్మద్ సల్మాన్ పేరు మీద ఉండగా, అతను నదీమ్‌కు విక్రయించాడు. ఆ తర్వాత ఫరీదాబాద్‌లోని సెకండ్ హ్యాండ్ డీలర్‌కు చేరింది. అక్కడి నుంచి అమీర్, తారిఖ్ అనే వ్యక్తుల చేతులు మారి, చివరికి మహమ్మద్ ఉమర్ వద్దకు చేరినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో తారిఖ్‌కు ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. అమీర్, తారిఖ్‌లను కూడా అధికారులు విచారిస్తున్నారు.

కీలకంగా మారిన‌ సీసీటీవీ ఫుటేజీ 
ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ కీలక ఆధారంగా మారింది. సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు తెల్ల రంగు ఐ20 కారును ఎర్రకోట పార్కింగ్ ప్రాంతంలో నిలిపినట్లు ఫుటేజీలో ఉంది. దాదాపు మూడు గంటల తర్వాత సాయంత్రం 6:48 గంటలకు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కారు పార్కింగ్ నుంచి బయటకు వెళ్లింది. ఫుటేజీలో అనుమానితుడు ఒక్కడే కనిపించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కారును పార్కింగ్‌కు ఎవరు తీసుకొచ్చారు? ఎవరు బయటకు తీశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 100కు పైగా సీసీటీవీ క్లిప్పులను పరిశీలిస్తున్నారు.

ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే ఫరీదాబాద్‌లో జైష్-ఎ-మొహమ్మద్ (JeM), అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన మాడ్యూల్‌ను పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో 2,900 కిలోల పేలుడు పదార్థాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇద్దరు వైద్యులు ఆదిల్ అహ్మద్ రథేర్, ముజమ్మిల్‌లను అరెస్టు చేయడంతో భయపడిన ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), పేలుడు పదార్థాల చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా లాల్ ఖిలా మెట్రో స్టేషన్‌లోని 1, 4 గేట్లను మూసివేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, ముంబై నగరాల్లో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.
Delhi Blast
Red Fort blast
Hyundai i20
Faridabad terror module
Jaish-e-Mohammed
Ansar Ghazwat-ul-Hind
UAPA Act
Delhi police investigation
Car bomb blast Delhi
Crime news

More Telugu News