RC Obul Reddy: తాడిపత్రిలో వైసీపీ నేతపై దాడి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి

RC Obul Reddy Attacked in Tadipatri Condition Critical
  • తాడిపత్రిలో వైసీపీ నేత ఆర్‌సీ ఓబుల్ రెడ్డిపై దాడి
  • గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్ర గాయాలు
  • అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఆర్‌సీ ఓబుల్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు, శరీరానికి తీవ్ర గాయాలవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళితే, తాడిపత్రిలోని ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో ఓబుల్ రెడ్డిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయనను గమనించిన స్థానికులు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని ఓబుల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అయితే, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాడిపత్రిలో రాజకీయ సున్నితత్వం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ దాడి వెనుక రాజకీయ కక్షలు ఉన్నాయా? లేక వ్యక్తిగత కారణాలతో జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. 
RC Obul Reddy
Tadipatri
Anantapur
YSRCP
Attack
Market Yard
Ketireddy Pedda Reddy
Political Violence
Andhra Pradesh

More Telugu News