ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఆరా

  • నగర పోలీస్ కమిషనర్‌తో మాట్లాడిన అమిత్ షా
  • ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి
  • ఇప్పుడేం చెప్పినా తొందరపాటు అవుతుందన్న సీఆర్పీఎఫ్ డీఐజీ
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారని అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడి పేలుడు ఘటనపై ఆరా తీశారు.

ఇదిలా ఉండగా, పేలుడు సంభవించిన చోటుకు ఎన్ఎస్‌జీ, ఎన్ఐఏ చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్, డీఐజీ సీఆర్పీఎఫ్ కూడా సంఘటన స్థలానికి వచ్చాయి. ఈ ప్రమాదంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఏం చెప్పినా తొందరపాటు అవుతుందని సీఆర్పీఎఫ్ డీఐజీ కిశోర్ ప్రసాద్ అన్నారు.

పేలుడు తర్వాత, రోడ్డుపై శరీర భాగాలు కనిపించాయని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించాడు. అక్కడి పరిస్థితిని చూసి ప్రజలు షాక్ అయ్యారని అన్నాడు. "రోడ్డుపై ఒకరి చేయి రక్తపు మడుగులో కనిపించడం చూసి మేం షాకయ్యాం. మాటల్లో వివరించలేని విధంగా ఉంది" అని అతను తెలిపాడు. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని లోక్ నాయక్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


More Telugu News