తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలలో ఘోర రోడ్డు ప్రమాదాలు... నివేదిక కోరిన సుప్రీంకోర్టు

  • వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన
  • నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్ఏఐ, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలకు ఆదేశం
  • రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవడమే ప్రమాదాలకు కారణమని పేర్కొన్న సుప్రీంకోర్టు
జాతీయ రహదారులపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాద ఘటనలపై నివేదిక సమర్పించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)ను, తెలంగాణ, రాజస్థాన్ ప్రభుత్వాలను ఆదేశించింది. గత వారం ఉభయ తెలుగు రాష్ట్రాలలో రెండు భారీ బస్సు ప్రమాదాలు జరిగి 40 మంది మృతి చెందిన విషయం విదితమే. వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది.

రాజస్థాన్‌లోని ఫలోడీ వద్ద జరిగిన ప్రమాదంపై జస్టిస్ జే.కె. మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఫలోడీతో పాటు తెలంగాణ-బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాలపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ రహదారుల మీద అనుమతి లేని దాబాలు కూడా ప్రమాదానికి కారణమని తెలిపింది. రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో సర్వే చేయాలని, రహదారుల పరిస్థితి ఎలా ఉందో నివేదిక ఇవ్వాలని తెలిపింది.

రహదారులు సరిగ్గా లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని మీడియాలో వచ్చిన కథనాలు స్పష్టం చేస్తున్నాయని, తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. నిర్వహణ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలని ధర్మాసనం ఆదేశించింది.

ట్రక్కులను రహదారి మీద ఆపేసి దాబాలకు వెళుతున్నారని, ఆగిన వాహనాలను ఇతర వాహనాలు ఢీకొనడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. దీనిని నిరోధించడం అవసరమని సూచించింది. టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ రహదారులు మాత్రం సరిగా ఉండటం లేదని పేర్కొంది.


More Telugu News