ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం
  • మామండూరు అటవీప్రాంతం, ఎర్రచందనం డిపో సందర్శన వివరాలు పంచుకున్న పవన్ 
  • పవన్ చొరవను ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు
  • నేటి కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చ
  • పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర మంత్రులు ప్రశంసలు కురిపించారు. పవన్ పనితీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అభినందించారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మామండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచందనం డిపోను సందర్శించిన వివరాలను పవన్ కల్యాణ్ నేటి మంత్రివర్గ సమావేశంలో పంచుకున్నారు. వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆక్రమణలపై ఆధారాలతో వీడియోలు తీయించానని తెలిపారు. సందర్భంగా ఆయన చొరవను, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తీరును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలతో ఏవైనా పరికరాలు చేద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు.

సోమవారం సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దాదాపు 70 అజెండా అంశాలపై కూలంకషంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా, వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై సీఆర్‌డీఏ తీసుకున్న నిర్ణయాలను కూడా మంత్రివర్గం సమర్థించింది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు భూ కేటాయింపుల్లో ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. రెవెన్యూ శాఖలో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపింది.

సమావేశం అనంతరం మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఇటీవల సంభవించిన మొంథా తుపాను సమయంలో యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అండగా నిలవడం వల్లే నష్టాన్ని తగ్గించగలిగామని తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) ద్వారా నిరంతరం పర్యవేక్షించడం సత్ఫలితాలనిచ్చిందని అన్నారు. సమన్వయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని, ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

ఈ సందర్భంగా పేదలందరికీ ఇళ్లు అందించే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నివాస స్థలం లేని వారి జాబితాలను సిద్ధం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.


More Telugu News