దాని కోసం ప్రాణమిస్తాడు.. అభిషేక్ శర్మ సీక్రెట్ చెప్పిన యువరాజ్!

  • ఆస్ట్రేలియా సిరీస్‌లో అదరగొట్టిన అభిషేక్ శర్మ
  • ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యువ బ్యాటర్
  • అభిషేక్ బ్యాట్ల పిచ్చి గురించి చెప్పిన యువరాజ్ సింగ్
  • ప్రాణం పోయినా బ్యాట్ మాత్రం ఇవ్వడంటూ ఫన్నీ కామెంట్స్
  • త‌న‌ బ్యాట్లన్నీ తీసుకున్నాడ‌న్న యువీ
భారత క్రికెట్‌లో యువ సంచలనంగా మారిన పంజాబ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్నాడు. అయితే, అతడి ఆట గురించే కాకుండా, అతడికి బ్యాట్లపై ఉన్న పిచ్చి గురించి మెంటార్ యువరాజ్ సింగ్ చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ... "అభిషేక్ శర్మ నుంచి ఏదైనా తీసుకోవచ్చు కానీ, బ్యాట్ మాత్రం అస్సలు తీసుకోలేం. వాడు చచ్చిపోతాడు, దెబ్బలు తింటాడు, ఏడుస్తాడు కానీ తన బ్యాట్ మాత్రం ఇవ్వడు. తన దగ్గర 10 బ్యాట్లు ఉన్నా, రెండే ఉన్నాయని చెబుతాడు. నా బ్యాట్లన్నీ తను తీసుకున్నాడు. కానీ, తనది ఒక్కటి కూడా ఇవ్వడు" అంటూ యువరాజ్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు.

ఆసీస్‌తో సిరీస్‌లో అద‌ర‌గొట్టిన అభిషేక్‌.. ప‌లు రికార్డులు
ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అభిషేక్ 5 మ్యాచ్‌లలో 163 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. కేవలం 528 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకుని, సూర్యకుమార్ యాదవ్ (573 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే, విరాట్ కోహ్లీ తర్వాత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.

సిరీస్ విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ల మధ్య మంచి బంధం ఉందని, వారిద్దరూ జట్టుకు ఆనందాన్ని పంచుతున్నారని ప్రశంసించాడు. పొట్టి ఫార్మాట్‌లో మ్యాచ్ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వారు వేగంగా నేర్చుకుంటున్నారని తెలిపాడు.


More Telugu News